International Nurses Day 2021: న‌ర్సుల త్యాగం మాన‌వీయ‌మైన‌ది- సీఎం కేసీఆర్

International Nurses Day: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2021-05-12 06:46 GMT
సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్ )

International Nurses Day: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రోగులకు వైద్య చికిత్స అందించే సమయంలో ఎంతో సహనంతో, తల్లిలాగా ప్రేమతో, సాంత్వన చేకూర్చే సిస్టర్ల త్యాగం మానవీయమైనదని సీఎం కొనియాడారు. కరోనాతో ప్రపంచం అల్లకల్లోలమైపోతున్న నేటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్య సేవలందిస్తున్న నర్సుల రుణం తీర్చుకోలేనిదని సీఎం అన్నారు.

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవంనాడు గుర్తుచేసుకుంటారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820, మే 12న ఇటలీలో జన్మించింది. 1853న లండన్‌ లోని ఓ స్త్రీల ఆస్పత్రిలో సూపరిండెంట్‌గా చేరిన నైటింగేల్, 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకొని వెళ్ళింది.

1859లో 'నోట్స్‌ ఆన్‌ నర్సింగ్‌' అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగేల్‌, ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా స్థాపించింది. నైటింగేల్‌ సేవలను గుర్తించిన 'ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నర్సెస్‌' సంస్థ 1965 నుండి నైటింగేల్‌ పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు.

Tags:    

Similar News