కేసీఆర్ 60 రోజుల యాక్షన్ ప్లాన్

తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా కోమటిబండలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, మున్సిపల్‌ చట్టం, రెవెన్యూ చట్టం రూపకల్పనపై కలెక్టర్లతో చర్చించారు.

Update: 2019-08-21 10:39 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా కోమటిబండలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, మున్సిపల్‌ చట్టం, రెవెన్యూ చట్టం రూపకల్పనపై కలెక్టర్లతో చర్చించారు. పల్లెల్లు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. అవినీతికి ఆస్కారం లేకుండా, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని తెలిపారు.

గజ్వేల్‌ మండలం కోమటిబండలో సీఎం కేసీఆర్‌ పర్యటించారు. 12వందల ఎకరాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. కోమటిబండలోని మిషన్‌ భగీరథ ప్లాంటును కూడా సందర్శించారు. కేసీఆర్‌ తో పాటు పలువురు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.

కోమటిబండలో కలెక్టర్లతో సమావేశమైన సీఎం కేసీఆర్‌ రెవెన్యూ చట్టంపై చర్చించారు. గజ్వేల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందని చెప్పారు. వర్షాలు బాగా కురవడానికి జీవ వైవిధ్యానికి దోహద పడుతుందని సీఎం తెలిపారు.

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో గజ్వేల్‌ నియోజకవర్గంలో అటవీభూములు, చెట్లులేక ఏడారిలా ఉండేదని మూడేళ్ల క్రితం ప్రారంభమైన అటవీ పునరుద్ధరణ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. 27 రకాల పండ్ల మొక్కలను పెంచడంతో మంకీ ఫుడ్‌ కోర్టుల్లా తయారవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 66లక్షల 48వేల ఎకరాల అటవీ భూమి ఉందని అయితే, ఈ భూమిలో అదే నిష్పత్తిలో అడవులు లేవని సీఎం కేసీఆర్‌ తెలిపారు.  

Tags:    

Similar News