13 పెళ్లిళ్ళ నిత్య పెళ్ళికొడుకు శివ శంకర్ బాబు అరెస్ట్..

Shiva Shankar Babu: విడాకులు పొందిన మహిళలే లక్ష్యంగా పెళ్లి పేరుతో వారిని నమ్మించి మోసానికి పాల్పడుతున్న నిత్య పెళ్లికొడుకు శివ శంకర్...

Update: 2022-07-21 08:53 GMT

13 పెళ్లిళ్ళ నిత్య పెళ్ళికొడుకు శివ శంకర్ బాబు అరెస్ట్..

Shiva Shankar Babu: విడాకులు పొందిన మహిళలే లక్ష్యంగా పెళ్లి పేరుతో వారిని నమ్మించి మోసానికి పాల్పడుతున్న నిత్య పెళ్లికొడుకు శివ శంకర్ ఆట కట్టించారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి పేరుతో పలువురు మహిళలను మోసం చేసినట్లు ఫిర్యాదులు రావడంతో గచ్చిబౌలి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు 13 మందిని పెళ్లి పేరుతో మోసం చేసినట్లు తెలుస్తోంది. శివ శంకర్‌పై హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడల్లో కేసులు నమోదయ్యాయి.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడికి చెందిన శివ శంకర్‌ బాబు విడాకులు తీసుకున్న మహిళలే లక్ష్యంగా మోసాలకు తెరలేపాడు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో వారి ప్రొఫైల్స్ ఆధారంగా పరిచయాలు పెంచుకుంటాడు. ఈ క్రమంలోనే కొండాపూర్‌కు చెందిన ఓ మహిళను తనకు ఎవరూ లేరని ప్రైవేటు ఉద్యోగినని నమ్మించి ఈ ఏడాది ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకున్నాడు. అనంతరం కొండాపూర్‌లో ఓ అపార్టుమెంట్‌లో కాపురం పెట్టాడు. వివాహమైన రెండు నెలల్లోనే ఆఫీస్‌ ద్వారా అమెరికా వెళ్లే అవకాశం వచ్చిందని చెప్పి ఆమె వద్ద 30 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత అమెరికా ఊసెత్తకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా బండారం బయటపడింది.

శివ శంకర్‌కు అంతకుముందే చాలా పెళ్లిళ్లు అయ్యాయని తెలుసుకుని మరో బాధితురాలితో కలిసి ఈ నెల 13న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శివ శంకర్‌ బాగోతాలపై నిఘా పెట్టగా అతడి వలలో చాలామంది పడి మోసపోయినట్లు వెలుగులోకి వచ్చింది. తమను మోసం చేసిన శివ శంకర్‌ని అరెస్ట్ చేయాలంటూ పలువురు బాధితులు ధర్నా కూడా చేపట్టారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటివరకు నిందితుడు ఐదు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తమ దర్యాప్తులో తేలినట్లు పోలీసులు మాదాపూర్ తెలిపారు. 

Tags:    

Similar News