ప్రతిపక్షాలు ఎన్ని ఫీట్లు చేసినా.. హ్యాట్రిక్ పక్కా అంటున్న సీఎం కేసీఆర్

BRS: రేపటి నుంచి 21 వరకు బీఆర్ఎస్ వరుస కార్యక్రమాలు

Update: 2023-09-14 11:33 GMT

ప్రతిపక్షాలు ఎన్ని ఫీట్లు చేసినా.. హ్యాట్రిక్ పక్కా అంటున్న సీఎం కేసీఆర్

BRS: ప్రతిపక్షాలు ఎన్ని ఫీట్లు చేసినా.. హ్యాట్రిక్ పక్కా అంటున్నారు కేసీఆర్. సంపూర్ణ మెజారిటీతో మళ్లీ అధికారం తమదే అని ధీమాగా ఉన్నారు. 10ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన పురోగతో మరోసారి పట్టం కడుతుందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గరపడుతుండంతో...ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు అభివృద్ధి పనులతో మరింత స్పీడ్ పెంచారు గులాబీ బాస్. రేపటి నుంచి.. ఈ నెల 21 వరకు వరుస కార్యక్రమాలకు ప్లాన్‌ చేసింది పార్టీ. 15న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల ప్రారంభోత్సవాలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రారంభమవుతున్నాయని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయా జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు.

ఇక తెలంగాణకే తలమానికమైన మరో ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఓపెనింగ్స్ కు కేసీఆర్ సిద్దమయ్యారు. ఈనెల 16న దక్షిణ తెలంగాణ వరప్రదాయినీ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగ జరగనుంది. కొల్లాపూర్‌ దగ్గరలోని నార్లాపూర్‌ దగ్గర ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. మరుసటి రోజు.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి పల్లె నుంచి సర్పంచులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు కలశాలతో కృష్ణమ్మ నీటిని ఊరేగింపుతో తెచ్చి గ్రామాల్లోని దేవాలయాల్లో దేవుడి విగ్రహాలకు అభిషేకం చేయాలని ఇప్పటికే సమీక్షా సమావేశంలో గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. అలాగే సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో నిర్వహించేందుకు ప్రభుత్వం, పార్టీ పరంగా సన్నాహాలు చేస్తోంది. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌ నాంప‌ల్లిలోని ప‌బ్లిక్ గార్డెన్స్‌లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వేడుక‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగుర‌వేయ‌నున్నారు.

సెప్టెంబర్ 21న రెండో విడత డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి సిద్ధమవుతోంది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. 23 నియోజకవర్గాలకు చెందిన మరో 13వేల 300 మంది లబ్ధిదారులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయనున్నారు. ఈ పథకం గ్రేటర్ పరిధిలో పార్టీకి మంచి ఊపు తెస్తుందనే అంచనాలో ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిపనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. ఇది ఇలా ఉంటే.. రేపు బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కానుంది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో...పార్లమెంట్ ప్రత్యేక సెషన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది. పార్టీ రాజ్య సభ, లోక్ సభ సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరుతో జమిలి ఎన్నికల బిల్లు తీసుకురాబోతుందన్న చర్చ జరుగుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి.. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో జమిలీ ఎన్నికల కోసం.. కేంద్రం బిల్లు తెస్తే.. సభలో ఎలా వ్యవహరించాలని..దానికి ఆమోదం తెలపలా.. వ్యతిరేకించాలా అని చర్చించున్నారు.దీంతో పాటు ఇండియా పేరును తొలగించి..భారత్ పేరు పెట్టాలని కూడా కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ బిల్లు ప్రవేశపెడితే.. బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అనేదానిపైనా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వీటితోపాటు.. ఉమ్మడి పౌర స్మృతి, ఓబీసీ వర్గీకరణ బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News