Smart Watch: ప్రాణాలను కాపాడే స్మార్ట్ వాచ్‌.. ఎలాగో తెలుసా..?

Smart Watch: ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయం తెలుసుకునేందుకు ఉపయోగించే ఓ గ్యాడ్జెట్.

Update: 2025-03-01 09:01 GMT

Smart Watch: ప్రాణాలను కాపాడే స్మార్ట్ వాచ్‌.. ఎలాగో తెలుసా.?

Smart Watch: ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయం తెలుసుకునేందుకు ఉపయోగించే ఓ గ్యాడ్జెట్. కానీ ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌ అందుబాటులోకి రావడంతో వాచ్‌తో చేయలేని పని అంటూ లేకుండా పోయింది. ముఖ్యంగా హెల్త్‌ ఫీచర్స్‌తో వచ్చే వాచ్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా శాస్త్రవేత్తలు కొత్త స్మార్ట్‌వాచ్‌ను అభివృద్ధి చేశారు. ఇది కార్డియాక్ అరెస్టు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించగలదు. ఈ ఆధునిక సాంకేతికత సహాయంతో సమయానికి హెచ్చరిక అందుతుంది దీని వల్ల అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం పొందే అవకాశం ఉంటుంది. 

ఇటీవల గూగుల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రత్యేకమైన స్మార్ట్‌వాచ్‌ కార్డియాక్ అరెస్టు ప్రమాదాన్ని గుర్తించి, అత్యవసర సేవలకు దానంతటదే కాల్‌ చేయగలదు. ఈ స్మార్ట్‌వాచ్‌ మెషిన్ లెర్నింగ్‌ ఆల్గారిథమ్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఇది 99.99% ఖచ్చితత్వంతో గుండె ఆగిన పరిస్థితిని గుర్తించగలదు. ఈ స్మార్ట్‌వాచ్‌ ఫోటోప్లిథిస్మోగ్రఫీ (PPG) సెన్సార్లు, మోషన్ డేటాను ఉపయోగించి గుండె పనితీరును గమనిస్తుంది. గుండె కొట్టుకోవడం ఆగినట్లు గుర్తించిన 57 సెకన్లలోపే పరిస్థితిని విశ్లేషిస్తుంది. అనంతరం 20 సెకన్లపాటు యూజర్ స్పందన కోసం వేచిచూస్తుంది. యూజర్ స్పందించకపోతే, అత్యవసర సేవలకు కాల్‌ చేస్తుంది.

ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ఈ స్మార్ట్‌వాచ్‌ పనితీరును ఆరు విభిన్న పరిస్థితుల్లో పరీక్షించారు. ఆసుపత్రి వాతావరణం, సాధారణ జీవనశైలి, శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో దీని పనితీరును పరీక్షించారు. పరిశోధనల్లో భాగంగా 100 మంది రోగులను ఎలెక్ట్రోఫిజియాలజీ ల్యాబ్‌లో ఉంచి, కంట్రోల్డ్ పద్ధతిలో వారి గుండె స్పందనను తగ్గించారు. 99 మంది ఇతరులకు ప్రత్యేకమైన టెక్నిక్ (టోర్నికెట్‌ ద్వారా నరాల్లో రక్తప్రవాహాన్ని నిలిపివేయడం) ఉపయోగించి గుండె ఆగిన తరహా పరిస్థితిని సృష్టించారు. 948 మంది సాధారణంగా తమ రోజువారీ జీవితంలో ఈ స్మార్ట్‌వాచ్‌ను ధరించి పరీక్షించారు. 21 మంది స్టంట్ ఆర్టిస్టులు అకస్మాత్తుగా కిందపడే పరిస్థితిని పునరావృతం చేసి, కార్డియాక్ అరెస్టును పోలి ఉన్న పరిస్థితులను పరీక్షించారు.

యూజర్ ప్రశాంతంగా ఉన్నప్పుడు, కార్డియాక్ అరెస్టును గుర్తించే సంసెటీవిటీ 72%గా ఉంది. అకస్మాత్తుగా పడిపోయే సందర్భాల్లో ఇది 53% ఖచ్చితత్వంతో పనిచేసింది. అప్రయత్నంగా అత్యవసర సేవలకు కాల్ వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా (21.67 యూజర్-యేళ్లకు 1 తప్పుదారి కాల్) ఉన్నట్లు అధ్యయనం తేల్చింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ స్మార్ట్‌వాచ్ గుండె స్పందన ఆగిపోయే ఘటనలను ముందుగా గుర్తించి ప్రాణాలను కాపాడగలదు. ముఖ్యంగా, కార్డియాక్ అరెస్టు సంభవించిన సమయంలో దగ్గర్లో ఎవరూ లేకపోతే, ఈ సాంకేతికత ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు దీని పనితీరును మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారు.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యపరమైన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా వైద్యుల సూచనలు తీసుకోవాలి.

Tags:    

Similar News