REDMI Note 15 Pro: మార్కెట్లోకి రెడ్‌మీ నోట్ 15 ప్రో సిరీస్.. 200MP కెమెరా, పవర్‌ఫుల్ AI ఫీచర్లతో అదిరిపోయే ఎంట్రీ..!
REDMI Note 15 Pro: స్మార్ట్‌ఫోన్ ప్రియుల నిరీక్షణకు తెరదించుతూ రెడ్ మీ తన సరికొత్త అస్త్రాలను భారత మార్కెట్లోకి వదిలింది.
REDMI Note 15 Pro: మార్కెట్లోకి రెడ్‌మీ నోట్ 15 ప్రో సిరీస్.. 200MP కెమెరా, పవర్‌ఫుల్ AI ఫీచర్లతో అదిరిపోయే ఎంట్రీ..!
REDMI Note 15 Pro: స్మార్ట్‌ఫోన్ ప్రియుల నిరీక్షణకు తెరదించుతూ రెడ్ మీ తన సరికొత్త అస్త్రాలను భారత మార్కెట్లోకి వదిలింది. టెక్నాలజీ ప్రపంచంలో ఎప్పుడూ సంచలనాలు సృష్టించే నోట్ సిరీస్‌లో భాగంగా 'రెడ్ మీ నోట్ 15 ప్రో' శ్రేణిని అధికారికంగా లాంచ్ చేసింది. కేవలం ఫీచర్లతోనే కాకుండా లుక్స్ పరంగానూ మురిపిస్తున్న ఈ సిరీస్‌లో ప్రో, ప్రో ప్లస్ అనే రెండు వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ అంటే కేవలం కాలింగ్ కోసమే కాదు, అదొక పవర్‌హౌస్ అని నిరూపించేలా షియోమీ ఈ స్మార్ట్‌ఫోన్లను తీర్చిదిద్దింది.
ఈ కొత్త ఫోన్ల డిజైన్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అత్యంత పటిష్టమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వచ్చిన ఈ ఫోన్లు డ్రాప్, బెండ్ టెస్టుల్లో ఎస్జీఎస్ సర్టిఫికేషన్ పొందాయి. ముఖ్యంగా ఐపీ69కే రేటింగ్ ఉండటం వల్ల నీటిలో రెండు మీటర్ల లోతున గంటల తరబడి ఉన్నా వీటికి ఏమీ కాదు. ప్రో ప్లస్ మోడల్‌లో ఉన్న ఫైబర్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ మన్నికను పెంచడమే కాకుండా, వెట్ టచ్ టెక్నాలజీ సాయంతో చేతులు తడిగా ఉన్నా స్క్రీన్ సులువుగా పనిచేసేలా చేస్తుంది.
ఫోటోగ్రఫీ ప్రియులకు ఈ సిరీస్ ఒక పండుగ లాంటిదని చెప్పాలి. ఏకంగా 200 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్‌తో అద్భుతమైన క్లారిటీని ఈ ఫోన్లు అందిస్తున్నాయి. ఐదు రకాల ఫోకల్ లెంగ్త్‌లు, డీఏజీ హెచ్‌డీఆర్ వంటి ఫీచర్లు ఫోటోలను ప్రొఫెషనల్ స్థాయిలో మారుస్తాయి. అంతేకాకుండా హైపర్ ఏఐ ఇంటిగ్రేషన్ ద్వారా ఫోటోల్లోని అనవసరమైన ఆబ్జెక్టులను తొలగించడం, ఇమేజ్ క్వాలిటీని పెంచడం వంటివి చిటికెలో చేసేయవచ్చు. సెల్ఫీల కోసం కూడా అధిక సామర్థ్యం గల కెమెరాలను ఇందులో అమర్చారు.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వీటిలో అత్యాధునిక ప్రాసెసర్లను వాడారు. ప్రో ప్లస్ వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్ ఉండగా, ప్రో మోడల్‌లో డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. వేడిని తగ్గించడానికి ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్ అదనపు బలాన్ని ఇస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ ఓఎస్ 2తో పాటు గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్ వంటి ఏఐ ఫీచర్లు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్తాయి. గేమింగ్ ఆడే వారికి కూడా ఇది స్మూత్ అనుభూతిని అందిస్తుంది.
ఇక ఎంటర్టైన్మెంట్ కోసం 1.5కే రిజల్యూషన్ కలిగిన ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ వంటివి అద్భుతమైన విజువల్స్ ఇస్తాయి. నెట్‌వర్క్ లేని సమయంలో కూడా పనిచేసే 'ఆఫ్ లైన్ వాయిస్ కమ్యూనికేషన్' ఈ సిరీస్‌లో హైలైట్ అని చెప్పవచ్చు. డాల్బీ అట్మాస్ స్పీకర్లు, 400 శాతం వాల్యూమ్ బూస్ట్ ఫీచర్లతో యూజర్లకు మల్టీమీడియా పరంగా తిరుగులేని అనుభూతి లభిస్తుంది. మొత్తానికి రెడ్ మీ నోట్ 15 ప్రో సిరీస్ ఫీచర్లు, ధర పరంగా భారత మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.