New Aadhaar App : ఆధార్ సెంటర్ల చుట్టూ తిరిగే బాధ ఉండదు..నేడే 'న్యూ ఆధార్ యాప్' ఫుల్ వెర్షన్ లాంచ్

ఆధార్ సెంటర్ల చుట్టూ తిరిగే బాధ ఉండదు..నేడే 'న్యూ ఆధార్ యాప్' ఫుల్ వెర్షన్ లాంచ్

Update: 2026-01-28 06:00 GMT

 New Aadhaar App : ఆధార్ కార్డు ఇప్పుడు మన జీవితంలో ఎంత ముఖ్యమైన భాగమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాంకు పనుల దగ్గరి నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఏది కావాలన్నా ఆధార్ ఉండాల్సిందే. అయితే ఆధార్‌లో పేరు మార్చాలన్నా లేదా మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయాలన్నా ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగడం పెద్ద పని అయిపోయింది. ఈ కష్టాలకు చెక్ పెడుతూ UIDAI నేడు (జనవరి 28, 2026) సరికొత్త న్యూ ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఇక మీ స్మార్ట్‌ఫోన్ నుంచే ఆధార్‌లోని చాలా పనులను చక్కబెట్టుకోవచ్చు.

మన దేశంలో ఆధార్ కార్డు లేనిదే ఏ పనీ జరగదు. కానీ అందులో చిన్న తప్పున్నా దాన్ని సరిదిద్దుకోవడానికి గంటల తరబడి సెంటర్ల దగ్గర వేచి చూడాల్సి వస్తోంది. ప్రజల ఇబ్బందులను గమనించిన UIDAI, మరింత భద్రతతో కూడిన, యూజర్ ఫ్రెండ్లీగా ఉండే సరికొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్‌ను ఈ రోజు ఆవిష్కరిస్తోంది. ఈ యాప్ కేవలం అప్‌డేట్ల కోసమే కాదు, యూజర్ల ప్రైవసీని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషించనుంది. మునుపటి వెర్షన్లలో ఉన్న సాంకేతిక లోపాలను సరిదిద్ది, సరికొత్త ఇంటర్‌ఫేస్‌తో దీన్ని రూపొందించారు.

కొత్త యాప్‌లో ఉండే అద్భుతమైన 5 ఫీచర్లు:

సెలెక్టివ్ షేరింగ్ : ఈ ఫీచర్ ద్వారా మీరు ఎవరికైనా ఆధార్ వివరాలు పంపాల్సి వస్తే.. అవసరమైన వివరాలు మాత్రమే పంపవచ్చు. ఉదాహరణకు, ఎవరికైనా మీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తెలియాలి అనుకుంటే, మిగిలిన అడ్రస్ లేదా ఇతర వివరాలు కనిపించకుండా నియంత్రించవచ్చు. ఇది మీ గోప్యతకు గొడుగు పడుతుంది.

బయోమెట్రిక్స్ లాక్ : మీ ఆధార్ వివరాలను ఎవరూ దుర్వినియోగం చేయకుండా కేవలం ఒక్క ట్యాప్‌తో మీ వేలిముద్రలు లాక్ చేసుకోవచ్చు. మీకు అవసరమైనప్పుడు మాత్రమే అన్‌లాక్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.

ఫ్యామిలీ ప్రొఫైల్ : ఇకపై ఇంట్లో ప్రతి ఒక్కరి కోసం వేర్వేరు ఫోన్లలో యాప్స్ ఉండక్కర్లేదు. ఒకే యాప్‌లో మీ కుటుంబ సభ్యులందరి ఆధార్ ప్రొఫైల్‌లను సేవ్ చేసుకుని మేనేజ్ చేయవచ్చు.

ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ : ఈ యాప్‌లోని గొప్ప ఫీచర్ ఇది. మీ ఇంటికి ఎవరైనా కొత్తవారు కిరాయికి వస్తే.. వారి ఆధార్ జెన్యూన్ కాదో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లేకపోయినా వారి ఐడెంటిటీని వెంటనే వెరిఫై చేయవచ్చు.

మొబైల్ నంబర్ అప్‌డేట్ : ఇప్పటిదాకా మొబైల్ నంబర్ అప్‌డేట్ కోసం తప్పనిసరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త యాప్‌లో ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ఇంటి నుంచే మొబైల్ నంబర్‌ను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ఈ సరికొత్త ఆధార్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి అధికారికంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మునుపటి కంటే ఈ యాప్ వాడటం చాలా సులభంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మీరు మొదటిసారి స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారైనా సరే, ఎవరి సహాయం లేకుండానే ఈ యాప్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఆధార్ సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా ప్రజలకు అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ అడుగు వేసింది.

Tags:    

Similar News