ChatGPT Outage: వేల మందికి చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం.. భారత్‌లో మాత్రం..!
ChatGPT Outage: ఓపెన్‌ఏఐకు చెందిన ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. మంగళవారం అమెరికాలో చాట్‌జీపీటీ భారీ అవుటేజ్‌ను ఎదుర్కొంది.
ChatGPT Outage: వేల మందికి చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం.. భారత్‌లో మాత్రం..!
ChatGPT Outage: ఓపెన్‌ఏఐకు చెందిన ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. మంగళవారం అమెరికాలో చాట్‌జీపీటీ భారీ అవుటేజ్‌ను ఎదుర్కొంది. అవుటేజ్‌ను ట్రాక్ చేసే వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ సమాచారం ప్రకారం.. యూఎస్‌లో వేలాది మంది వినియోగదారులు చాట్‌జీపీటీ సేవలు అందుబాటులో లేకపోవడంపై ఫిర్యాదులు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3:25 గంటల వరకు 12,000కు పైగా యూజర్లు తమకు చాట్‌జీపీటీ పనిచేయడం లేదని రిపోర్ట్ చేశారు. అయితే భారత్‌లో మాత్రం ఈ అవుటేజ్ ప్రభావం కనిపించలేదని, వినియోగదారులు సాధారణంగానే సేవలు ఉపయోగించగలిగినట్లు తెలుస్తోంది.
అమెరికాలో చాలా మంది యూజర్లు చాట్‌జీపీటీ ఓపెన్ చేసినప్పుడు లేదా ప్రాంప్ట్ ఎంటర్ చేసిన వెంటనే.. 'Hmm… something seems to have gone wrong' అనే ఎర్రర్ మెసేజ్ కనిపించిందని తెలిపారు. ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించినప్పుడు ఎర్రర్ మెసేజ్‌లు కనిపించడంతో.. చాట్‌జీపీటీ యూజర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గంటల తరబడి సేవలు నిలిచిపోవడంతో వేలమంది యూజర్లు అయోమయంలో పడ్డారు. దీంతో వారు డౌన్‌డిటెక్టర్‌ను ఆశ్రయించి అవుటేజ్ స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. బుధవారం నాటికి కూడా కొందరు యూజర్లు సోషల్ మీడియా వేదికగా చాట్‌జీపీటీ సరిగ్గా పని చేయడం లేదని పోస్ట్‌లు పెట్టారు.
టెక్ వెబ్‌సైట్ టెక్‌రాడార్ కథనం ప్రకారం.. ఈ అవుటేజ్ ప్రధానంగా అమెరికాలోనే ఎక్కువగా ప్రభావం చూపించింది. హంగేరీ వంటి కొన్ని దేశాల్లో కూడా సేవలు సరిగా అందలేదని యూజర్లు అంటున్నారు. అయితే కొంతమంది వినియోగదారులు వేరే వీపీఎన్‌లకు మారడం ద్వారా చాట్‌జీపీటీ యాక్సెస్ చేయగలిగారని తెలిపారు. ఐర్లాండ్, కెనడా, భారత్, పోలాండ్ వంటి దేశాల్లో చాట్‌జీపీటీ మాములుగా పనిచేస్తోంది. అయితే భారత్, పోలాండ్‌లో సేవలు కొద్దిగా నెమ్మదిగా ఉన్నాయనిటెక్‌రాడార్ పేర్కొంది.
ఈ అవుటేజ్‌పై ఓపెన్‌ఏఐ తన స్టేటస్ పేజ్‌లో స్పందించింది. 'ప్రస్తుతం కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. కొంతమంది వినియోగదారులకు చాట్ లోడ్ కావడంలో లేదా ఏదైనా అడిగినప్పుడు ఇబ్బందులు ఉండొచ్చు. మేము సమస్యను గుర్తించి పరిష్కార చర్యలు తీసుకున్నాం' అని వెల్లడించింది. చాట్స్, సెర్చ్, ఇమేజ్ జనరేషన్, కోడెక్స్, అట్లాస్ వంటి సేవలు కూడా ప్రభావితం అయ్యాయని తెలిపింది. చాట్‌జీపీటీ అవుటేజ్‌కు ప్రధాన కారణం.. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఏఐ ఇమేజ్‌లు, టెక్స్ట్ జనరేషన్ కోసం భారీగా రిక్వెస్టులు రావడంతో సిస్టమ్‌పై ఒత్తిడి పెరిగి ఈ సమస్య ఏర్పడినట్లు అంచనా వేశారు. మొత్తానికి అమెరికాలో జరిగిన ఈ చాట్‌జీపీటీ అవుటేజ్ వినియోగదారుల్లో కొంత ఆందోళన కలిగించినప్పటికీ.. భారత్‌లో సేవలు సాధారణంగానే కొనసాగడం ఊరటనిచ్చే అంశం. సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు ఓపెన్‌ఏఐ చర్యలు తీసుకుంటోందని కంపెనీ స్పష్టం చేసింది.