7 Planets Parade: ఆకాశంలో అద్భుతం... ఇవాళ మిస్ అయితే మళ్లీ 2040లోనే ఆ ఛాన్స్

Update: 2025-02-28 09:32 GMT

7 Planets Parade: ఆకాశంలో అద్భుతం... ఇవాళ మిస్ అయితే మళ్లీ 2040లోనే ఆ ఛాన్స్

7 Planets Parade in Sky: ఆకాశంలో ఒక అరుదైన అద్భుతాన్ని చూసే అవకాశం ఇది. ఒకేసారి ఏడు గ్రహాలు ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఆకాశంలో ఒకే వరుసలో పరేడ్ చేసేందుకు రెడీ అయ్యాయి.

అయితే, ఈ అద్భుతాన్ని చూసే అవకాశం ఇవాళ ఫిబ్రవరి 28న ఒక్కరోజే ఉంది. ఇవాళ తప్పితే మళ్ళీ మరో 15 ఏళ్ల తర్వాతే ఆ ఛాన్స్ వస్తుంది. అంటే ఇవాళ అంతరిక్షంలో ఆ ఏడు గ్రహాలు పరేడ్ చేయడం మిస్ అయితే, మళ్ళీ 2040 వరకు ఆ అరుదైన దృశ్యాన్ని చూసే ఛాన్స్ రాదు.

Full View

రైట్ టైమ్ ఏంటి?

ఆ అరుదైన స్పేస్ వండర్ చూసేందుకు ఇవాళ సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత 45 నిమిషాలకు ఆకాశంలో ఆ సీన్ కనిపిస్తుంది. ఇండియాలో అయితే సరిగ్గా రాత్రి 7 గంటలకు ఈ సీన్ చూడ్డానికి వీలు ఉంటుంది.

అయితే, ఈ అరుదైన దృశ్యాన్ని మిస్ అవకుండా చూడాలంటే ముందుగా చుట్టూ ఎత్తైన కట్టడాలు అడ్డం రాకుండా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. వీలైతే ఆ ఎత్తయిన ప్రదేశంలోంచే చూడగలిగితే ఇక ఏ డిస్టర్బెన్సూ ఉండదు. ఎలాంటి కాలుష్యం లేకుండా స్పష్టంగా, నిర్మలమైన ఆకాశం ఉన్న చోట ఈ సీన్ ఇంకా స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని గ్రహాలు ఏ పరికరాల సాయం లేకుండానే నేరుగా చూడొచ్చు. బుధుడు, నెప్ట్యూన్ గ్రహాలను స్పష్టంగా చూడ్డానికి మాత్రం బైనాకులర్స్ అవసరం అవుతాయి. ఇక యురేనస్ చూడ్డానికైతే టెలిస్కోప్ ఉంటేనే ఆ వ్యూ స్పష్టంగా కనిపిస్తుంది.

సూర్యాస్తమయం అయిన కొద్దిసేపటికే ముందుగా పశ్చిమాన శుక్ర గ్రహం కనిపిస్తుంది. దక్షిణాన ఇంకొంచెం ఎత్తులో అంగారక గ్రహం దర్శనమిస్తుంది. అంగారక గ్రహం చూడ్డానికి ఎరుపు రంగులో చుక్కలా మెరుస్తూ కనిపిస్తుంది. నైరుతి దిశలో గురు గ్రహం కనిపిస్తుంది.

ఎందుకిలా జరుగుతుంది?

సూర్యుడి చుట్టూ తిరిగే ఈ గ్రహాలన్నీ అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే ఒకే కక్ష్యలోకి వస్తుంటాయి. అది చూడ్డానికి అచ్చం గ్రహాలన్నీ ఒక వరుసలోకి వచ్చినట్లుగా కనిపిస్తుంది. గతంలో 2004 లో ఇలా ఈ ఏడు గ్రహాలు ఒకే వరుసలోకి రావడం కనిపించింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడిలా 2025 లో జరుగుతోంది.

అంతరిక్ష ప్రయోగాలు చేసే ఖగోళ శాస్త్రవేత్తలు ఆకాశాన్ని అధ్యయనం చేసేందుకు దీన్ని ఒక చక్కటి అవకాశంగా భావిస్తున్నారు. ఆస్ట్రోఫోటోగ్రాఫర్స్ కూడా ఆకాశంలో కనిపించే ఈ అద్భుతాన్ని తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ అవకాశం చేజారిపోతే మళ్లీ 2040 వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం... మీరు కూడా ఆ అవకాశం మిస్ చేసుకోకండి. 

Tags:    

Similar News