World Cup 2025: మహిళల క్రికెట్ వరల్డ్ కప్ 2025.. బెంగళూరు నుంచి వేదిక మార్పు

World Cup 2025: వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది.

Update: 2025-08-13 05:56 GMT

World Cup 2025: వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. భారత్, శ్రీలంకలలో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు 31 మ్యాచ్‌లలో తలపడనున్నాయి. అయితే, టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌తో పాటు కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సిన బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం నుంచి ఇప్పుడు వేదిక మారే అవకాశం ఉంది. ఇంతకీ ఆ వేదిక మారడానికి కారణం ఏంటి? దీని వెనుక ఆర్సీబీ ఉందా? అసలు ఏం జరిగింది, ఇప్పుడు కొత్త వేదిక ఏది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

మహిళల క్రికెట్ వరల్డ్ కప్ 2025కు సంబంధించిన షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ ఓపెనింగ్ మ్యాచ్‌తో పాటు మొత్తం ఐదు మ్యాచ్‌లు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది. కానీ, తాజా నివేదికల ప్రకారం కర్ణాటక ప్రభుత్వం ఈ మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వడం లేదు. అందుకే టోర్నమెంట్ వేదికను మార్చాలని నిర్ణయించారు.

ఎం. చిన్నస్వామి స్టేడియం నుంచి వేదిక మార్పుకు ప్రధాన కారణం, కొన్ని నెలల క్రితం అక్కడ జరిగిన ఒక విషాద ఘటన. ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 సంవత్సరాల తర్వాత తమ మొదటి టైటిల్ గెలుచుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని స్టేడియంలో ఒక విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. టికెట్లు లేకపోవడంతో స్టేడియం లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం భద్రతా ఏర్పాట్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. భద్రతకు సంబంధించిన అనుమతులు ఇవ్వడానికి ఇష్టపడకపోవడమే ఇప్పుడు స్టేడియం మార్పుకు కారణం.

బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌లు ఇప్పుడు కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించవచ్చని సమాచారం. టోర్నమెంట్‌లో భాగంగా భారత్ తమ మొదటి మ్యాచ్‌ను శ్రీలంకతో, రెండో మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లతో పాటు మిగిలిన మూడు మ్యాచ్‌లను కూడా తిరువనంతపురంకు మార్చే అవకాశం ఉంది. అయితే, ఈ మార్పులపై ఐసీసీ ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు.

మహిళల వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ మొదట బెంగళూరు, కొలంబో వేదికలను ఎంపిక చేసింది. పాకిస్థాన్ ఫైనల్స్‌కు రాకపోతే, ఈ మ్యాచ్ బెంగళూరులోనే జరిగే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎం. చిన్నస్వామి స్టేడియం నుంచి వేదిక మారిపోవడంతో ఫైనల్ మ్యాచ్‌ గురించి కూడా స్పష్టత లేదు.

Tags:    

Similar News