Vaibhav Suryavanshi's Real Story: నా కోసం మా అమ్మ 3 గంటలే నిద్రపోయేది.. కుటుంబం మొత్తం ఎంతో కష్టపడింది

Update: 2025-04-29 10:50 GMT

Vaibhav Suryavanshi's success story: వైభవ్ సూర్యవంశి... ప్రస్తుతం ఇండియాలోనే కాదు... యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 14 ఏళ్ల యంగ్ క్రికెటర్. ఐపిఎల్‌లోకి వచ్చీ రావడంతోనే తనకంటూ ఒక పేజీ కాదు... ఏకంగా పెద్ద చరిత్రే సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడిన ఈ యువ కెరటం కేవలం 35 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అందులో 11 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. ఐపిఎల్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన సెంచరీ.

సూర్యవంశీ ఈ ఫాస్టెస్ట్ సెంచరీతో మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు. ఐపిఎల్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా స్టార్ క్రికెటర్లు ఆడే గేమ్ కావడంతో ఈ ఐపిఎల్ వేదిక వైభవ్ సూర్యవంశీని యావత్ ప్రపంచానికి రాకీ భాయ్ స్టైల్లో చాలా గ్రాండ్‌గా పరిచయం చేసింది. కానీ తనకు ఈ విజయం అంత ఈజీగా వచ్చింది కాదని సూర్యవంశీ చెబుతున్నాడు.

"మా అమ్మ రాత్రి 11 గంటలకు పడుకుంటే మళ్లీ నా కోసం అర్ధరాత్రి 2 గంటలకే లేచి నా కోసం ఆహారం సిద్ధం చేసి, ప్రాక్టీస్ కోసం రెడీ చేసి పంపించే వారు. మా అమ్మ కేవలం ఆ 3 గంటలే నిద్రపోయే వారు. నాన్న నా కోసం తన పనిని కూడా వదిలేసి ఎంతో కష్టపడ్డారు. కుటుంబం కోసం నాన్న స్థానంలో అన్నయ్య పని చేయడం మొదలుపెట్టారు. ఏ రోజయినా సరే నువ్వు విజయం సాధిస్తావు అంటూ నాన్న నా వెంటపడే వారు. అలా నా సక్సెస్ కోసం మా కుటుంబం అంతా ఎంతో కష్టపడింది. ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఈ విజయం సాధించానంటే అది కేవలం మా అమ్మనాన్నల కష్టం వల్లే" అంటూ వైభవ్ సూర్యవంశీ చెప్పిన మాటలు అతడి కష్టాన్ని, అతడి విజయం కోసం ఆ కుటుంబం పడిన కష్టాన్ని స్పష్టంగా చెబుతోంది.

కోచ్ రాహుల్ సార్ ఎంతో ప్రోత్సహిస్తారని గుర్తుచేసుకున్నాడు. తనలాంటి సాధారణ క్రికెటర్‌కు ఆయన ప్రోత్సాహం లభించడం అనేది ఒక డ్రీమ్ లాంటిదేనని సుర్యవంశీ అభిప్రాయపడ్డాడు. జట్టులో ఉన్న సీనియర్స్ అన్నలు నన్ను చాలా ప్రోత్సహిస్తుంటారు. మైదానంలో నువ్వు బాగా ఆడగలవు అని ఎంకరేజ్ చేస్తుంటారు. అందుకే నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ నాపై ప్రెజర్ తక్కువ అని వైభవ్ సూర్యవంశీ ఉన్న విషయాన్ని దాచుకోకుండా చెప్పుకొచ్చాడు.

రాబోయే రోజుల్లో జట్టు విజయం కోసం నా వంతు పాత్ర పోషిస్తాను. అంతేకాకుండా టీమిండియాలో కూడా చోటు సంపాదించుకుని దేశం కోసం కూడా కృషి చేస్తానని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.

ఐపిఎల్‌లో ఫస్ట్ గేమ్ ఆడుతున్నాను అనే టెన్షన్ నాలో ఏమీ లేదు. ఇంటర్నేషనల్ బౌలర్స్‌ను ఎదుర్కోవాలి అనే భయం కూడా లేదు. నేను ఆడగలను అనే ఆత్మ విశ్వాసం మాత్రం ఉందని చెబుతున్న వైభవ్ సూర్యవంశీ నిజంగానే నేటి యువతకు స్పూర్తిదాయకం. 

Tags:    

Similar News