Asia Cup 2024: షాజైబ్ ఖాన్ భారీ సెంచరీ.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమి!
Asia Cup 2024: అండర్-19 ఆసియా కప్ 2024లో భారత జట్టుకు షాక్ తగిలింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 44 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
Asia Cup 2024: షాజైబ్ ఖాన్ భారీ సెంచరీ.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమి!
Asia Cup 2024: అండర్-19 ఆసియా కప్ 2024లో భారత జట్టుకు షాక్ తగిలింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 44 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. పాక్ నిర్ధేశించిన 282 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 237 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. టీమిండియా బ్యాటర్లలో నిఖిల్ కుమార్ (67; 77 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్తాన్ బౌలర్లలో అలీ రజా 3 వికెట్స్ పడగొట్టాడు. గ్రూప్ ఎలో ఉన్న భారత్ రెండో మ్యాచ్‌లో డిసెంబరు 2న జపాన్‌తో తలపడనుంది. జపాన్ సహా యూఏఈపై గెలిస్తేనే భారత్ సెమీస్ చేరుకుంటుంది. మరో మ్యాచ్‌లో పాక్ గెలిస్తే నేరుగా సెమీస్‌కు దూసుకెళుతుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్స్ కోల్పోయి 281 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్‌లు భారత బౌలర్లను ఆటాడుకున్నారు. షాజైబ్ ఖాన్ (159; 147 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్స్‌లు) భారీ సెంచరీ చేయగా.. ఉస్మాన్ ఖాన్ (60; 94 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 160 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 30 ఓవర్ల తర్వాత భారత బౌలర్లు పుంజుకుని.. వికెట్లు పడగొట్టారు. మహ్మద్ రియాజుల్లా (27), హరూన్ అర్షద్ (3), ఫర్హాన్ యూసఫ్ (0), ఫహమ్ ఉల్ హక్ (4), సాద్ బేగ్ (4) తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. భారత బౌలర్లలో సమర్థ్ నాగరాజ్ 3, ఆయుష్ మాత్రే 2 వికెట్లు పడగొట్టారు.
భారీ ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. 13 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచాడు. 9 బంతులు ఆడి 1 పరుగు మాత్రమే చేశాడు. ఆయుష్ మాత్రే (20), ఆంద్రీ సిద్ధార్థ్ (15), మహ్మద్ అమన్ (16), కిరణ్ చోర్మలే (20), హర్వాన్ష్ సింగ్ (26)లు ఎక్కవసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఓ వైపు వికెట్స్ పడుతున్నా.. నిఖిల్ కుమార్ పట్టుదల ప్రదర్శించాడు. యుధాజిత్ గుహ (12), మహ్మద్ ఈనాన్ (30; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పదో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినా.. అప్పటికే భారత్ ఓటమి ఖాయం అయింది. ఈనాన్ అవుట్ అవ్వడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. సెంచరీ చేసిన షాజైబ్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.