Team India Journey: 8 మ్యాచ్‌ల్లో 7 విజయాలు.. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ప్రయాణం ఇలా!

Team India Journey: డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. మొత్తం 8 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించిన టీమిండియా స్థిరమైన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంది.

Update: 2026-03-08 12:29 GMT

Team India Journey: 8 మ్యాచ్‌ల్లో 7 విజయాలు.. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ప్రయాణం ఇలా!

Team India Journey: డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. మొత్తం 8 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించిన టీమిండియా స్థిరమైన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంది. మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్‌లోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. టీ20 వరల్డ్ కప్ 2026లో ఫైనల్ వరకు భారత్ ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం.

టోర్నీ ఆరంభం నుంచే జోరు:

టీమిండియా తన టోర్నీ ప్రయాణాన్ని ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో యూఎస్‌ఏపై 29 పరుగుల విజయంతో ప్రారంభించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాపై 93 పరుగుల భారీ తేడాతో గెలిచి తమ ఆధిపత్యాన్ని చాటింది. గ్రూప్ దశలో అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్థాన్‌ను భారత్ 61 పరుగులతో ఓడించింది. ఈ విజయంతో టీమిండియా అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో భారత్ మరో విజయాన్ని సాధించింది.

వరుస విజయాలతో సెమీస్ దిశగా:

సూపర్ 8లో భాగంగా ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఇది టోర్నీలో టీమిండియాకు ఎదురైన ఏకైక పరాజయం. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలు భారీగా తగ్గాయి. దక్షిణాఫ్రికా ఓటమి తర్వాత టీమిండియా మరింత బలంగా పుంజుకుంది. ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం మార్చి 1న కొలకతాలో వెస్టిండీస్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. జింబాబ్వే, వెస్టిండీస్‌ మ్యాచ్‌లు టీమిండియాకు డూ ఆర్ డై లాంటివే అయినా.. అద్భుతంగా ఆడి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది.

సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై థ్రిల్లింగ్ విజయం:

మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. దీంతో టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు అర్హత సాధించింది. నేడు అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ట్రోఫీ కోసం తలపడనుంది.

భారత్ – న్యూజిలాండ్ హెడ్ టు హెడ్:

టీ20 ఫార్మాట్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకు 30 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 18 మ్యాచ్‌లు గెలవగా.. న్యూజిలాండ్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో మాత్రం కివీస్ జట్టుదే పైచేయి. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News