ICC Rankings: చరిత్ర సృష్టించిన శుభ్‌మాన్ గిల్.. ఇంగ్లాండ్‌పై సెంచరీతో రికార్డ్ కైవసం
ICC Rankings: శుభ్‌మాన్ గిల్ వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్-1 బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోని మూడవ వన్డే (IND vs ENG ODI సిరీస్)లో చేసిన సెంచరీతో ఈ స్థానం దక్కింది. అంతకుక ముందు నంబర్ వన్ రేసులో ఉన్న పాకిస్తాన్‌కు చెందిన బాబర్ ఆజంను వెనక్కినెట్టి గిల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అహ్మదాబాద్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ లో గిల్ 112 పరుగులతో చెలరేగిపోయాడు. సెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాని కారణంగా అతను నంబర్ వన్ స్థానంలో ఉన్న బాబర్ ఆజంను ఓడించి మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
భారత్-ఇంగ్లాండ్ మూడో వన్డే మ్యాచ్‌కు ముందు బాబర్ ఆజం 786 రేటింగ్ పాయింట్లను కలిగి ఉండగా, శుభ్‌మాన్ గిల్ 781 పాయింట్లను కలిగి ఉన్నాడు. బుధవారం జరిగిన ట్రై-సిరీస్‌లో భారత్-ఇంగ్లాండ్‌తో పాటు, పాకిస్తాన్ vs సౌత్ (PAK vs SA) మ్యాచ్ కూడా జరిగింది. ఒకవైపు గిల్ 112 పరుగులు చేయగా, బాబర్ ఆజం కేవలం 23 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. బాబర్ ఆజం తక్కువ పరుగులకే ఔట్ కావడం వల్ల గిల్ ర్యాంకింగ్స్‌లో ముందుకు వెళ్లగలిగాడు.
టాప్-10లో నలుగురు భారతీయులు
ఒకవైపు, శుభ్‌మాన్ గిల్ ఇప్పుడు ప్రపంచ నంబర్-1 వన్డే బ్యాట్స్‌మన్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో, విరాట్ కోహ్లీ ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ 60.33 సగటుతో 183 పరుగులు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా తను ర్యాంకింగ్‌లో స్థానం సంపాదించుకోగలిగాడు.
వన్డేల్లో టీమిండియా నంబర్ 1
ఫిబ్రవరి 6న భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరిగింది. దీనిలో టీం ఇండియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత రెండవ మ్యాచ్ కటక్‌లో జరిగింది. ఇది రోహిత్ శర్మ 119 పరుగుల సెంచరీ కారణంగా వార్తల్లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో కూడా భారత జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పుడు భారత జట్టు అహ్మదాబాద్‌లో కూడా తన జెండాను ఎగురవేసింది. భారత జట్టు ఇప్పటికే వన్డేల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ జట్టు. ఇంగ్లాండ్‌ను ఓడించిన తర్వాత ఈ స్థానం మరింత పదిలం అయింది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది.