Rohit Sharma : ముంబైలో రోహిత్ శర్మకు చుక్కలు చూపించిన అభిమానులు.. రక్షించిన జిగ్రీదోస్త్

Rohit Sharma : టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

Update: 2025-10-11 05:30 GMT

Rohit Sharma : టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించినప్పటికీ, ఆస్ట్రేలియా సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా టూర్ కోసం బ్యాటింగ్ ప్రాక్టీస్, ఫిట్‌నెస్పై దృష్టి పెట్టిన రోహిత్, తన సొంత నగరమైన ముంబైలోని శివాజీ పార్క్ మైదానంలో కసరత్తులు చేస్తున్నారు. అయితే, ప్రాక్టీస్ ముగిసిన తర్వాత రోహిత్ తన అభిమానుల కారణంగా ఒక చిన్న సమస్యలో చిక్కుకోవాల్సి వచ్చింది.

అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో మొదలయ్యే వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ అక్టోబర్ 10న శివాజీ పార్క్ మైదానంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. రోహిత్ రాక గురించి తెలియగానే వందలాది మంది అభిమానులు ఆయనను చూడడానికి మైదానానికి చేరుకున్నారు. రోహిత్ కొట్టిన ప్రతి షాట్‌కు చప్పట్లు, కేకలు కొడుతూ అభిమానులు తమ ఆనందాన్ని పంచుకున్నారు.

అయితే, రోహిత్ ప్రాక్టీస్ ముగించుకుని మైదానం నుంచి బయటకు వచ్చే సమయానికి గేటు దగ్గర అభిమానుల భారీ రద్దీ ఏర్పడింది. రోహిత్‌ను దగ్గరగా చూడాలని, ఫోటోలు తీసుకోవాలని, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవాలని అభిమానులు ప్రయత్నించడంతో రోహిత్ ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఈ గందరగోళం కారణంగా, రోహిత్ చాలాసేపు బయటకు రాలేకపోయారు. పరిస్థితి అదుపు తప్పడంతో రోహిత్‌తో పాటు ఉన్న ఆయన సన్నిహిత స్నేహితుడు, టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నయ్యర్ రంగంలోకి దిగారు.





అభిషేక్ నయ్యర్ స్వయంగా బయటకు వచ్చి, అభిమానులతో శాంతియుతంగా ఉండాలని, రోహిత్‌ను బయటకు వెళ్లనివ్వాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. నయ్యర్ విజ్ఞప్తి మేరకు అభిమానులు కాస్త పక్కకు జరగడంతో, చాలా కష్టం మీద రోహిత్ శర్మ ఆ గుంపు నుండి బయటపడి తన ఇంటికి బయలుదేరారు. అభిమానం ఒక్కోసారి తమ స్టార్ ఆటగాళ్లకు ఇబ్బందిగా మారుతుందనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఈ మొత్తం తతంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆస్ట్రేలియా టూర్ కోసం రోహిత్ శర్మ సిద్ధమవుతున్న తీరు అద్భుతంగా ఉందని ఈ ప్రాక్టీస్ సెషన్ నిరూపించింది. బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో రోహిత్ అద్భుతమైన టైమింగ్‌తో కనిపించారు. ఆయన బ్యాట్ నుండి భారీ షాట్లు చాలా సులువుగా దూసుకెళ్లాయి. ఒక షాట్ అయితే ఏకంగా మైదానం బయట పార్క్ చేసి ఉన్న ఆయన సొంత కారు అద్దానికి తగిలింది. ఈ షాట్‌కు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.

గత కొంతకాలంగా రోహిత్ మెరుగైన ఫిట్‌నెస్ తో కనిపిస్తున్నారు. ఇటీవల అభిషేక్ నయ్యర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రోహిత్ దాదాపు 8-10 కిలోల బరువు తగ్గారని వెల్లడించారు. రోహిత్ కష్టపడి మెరుగుపరుచుకున్న ఈ ఫిట్‌నెస్ ఫొటోలు, వీడియోలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Tags:    

Similar News