IPL 2025 : హైదరాబాద్ ముందు తేలిపోయిన రాయల్ ఛాలెంజర్స్.. పాయింట్ల పట్టికలో వెనక్కి!

Update: 2025-05-24 03:49 GMT

 IPL 2025 : హైదరాబాద్ ముందు తేలిపోయిన రాయల్ ఛాలెంజర్స్.. పాయింట్ల పట్టికలో వెనక్కి!

 IPL 2025 : ఐపీఎల్ (IPL)లో ఈసారి అనూహ్య ఫలితాలు నమోదవుతున్నాయి. అభిమానులను నిరాశపరుస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) చేతిలో భారీ ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో RCB పాయింట్ల పట్టికలో ఒక స్థానం దిగజారి మూడో స్థానానికి పడిపోయింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేయగా, RCB మాత్రం లక్ష్యఛేదనలో తడబడింది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలపై కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్‌లో అదరగొట్టింది. నిర్ణీత ఓవర్లలో ఏకంగా 231 పరుగుల భారీ స్కోరును నమోదు చేసి RCB ముందు ఒక పెద్ద సవాలును ఉంచింది. యువ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ల అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఇషాన్ కిషన్ 48 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 94 పరుగులు చేసి సెంచరీకి అతి దగ్గరలో నిలిచాడు. మరోవైపు, అభిషేక్ శర్మ కూడా కేవలం 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపు వేగంతో 34 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించాడు. ఆ తర్వాత వచ్చిన అభికేత్ వర్మ కేవలం 9 బంతుల్లో 26 పరుగులు చేశాడు. వీరి దూకుడుతోనే హైదరాబాద్ భారీ స్కోరును సాధించగలిగింది. ఇషాన్ కిషన్‌కు అతని అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. "పిచ్ చాలా బాగుంది, అందుకే కనీసం 200 పరుగులు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ప్రాక్టీస్ సెషన్‌లో బాగా సాధన చేశాను. మంచి షాట్లు ఆడాను. దాని ఫలితమే మ్యాచ్‌లో కనిపించింది" అని ఇషాన్ కిషన్ మ్యాచ్ అనంతరం చెప్పాడు.

RCB బ్యాటింగ్ తడబాటు

232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభం లభించినా, చివరికి లక్ష్యానికి చాలా దూరంలోనే ఆగిపోయింది. RCB జట్టు కేవలం 189 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో హైదరాబాద్ చేతిలో 42 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. RCB బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, విల్ సాల్ట్ మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయగలిగారు. విల్ సాల్ట్ 32 బంతుల్లో 62 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. అయితే, వీరిద్దరు అవుటైన తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 11, రజత్ పాటిదార్ 18, జితేష్ శర్మ 24 పరుగులు చేశారు. రోమారియో షెపర్డ్ మొదటి బంతికే అవుట్ కాగా, కృనాల్ పాండ్యా 8, టిమ్ డేవిడ్ 1 పరుగు మాత్రమే చేయగలిగారు. చివరి 7 వికెట్లను కేవలం 16 పరుగులకే కోల్పోవడం RCB ఓటమికి ప్రధాన కారణం.

హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ అద్భుతంగా రాణించి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. జయదేవ్ ఉనద్కట్ ఒక వికెట్, ఎషాన్ మలింగా 2 వికెట్లు తీశారు. హర్ష్ దూబే, రెడ్డి, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

పాయింట్ల పట్టికలో RCBకి ఎదురుదెబ్బ

ఈ ఓటమితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. పంజాబ్ కింగ్స్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకుంది. పంజాబ్ కింగ్స్‌కు కూడా RCBతో సమానంగా 17 పాయింట్లు ఉన్నప్పటికీ, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా అది రెండో స్థానంలో నిలిచింది. ఈ ఓటమి RCB ప్లేఆఫ్స్ అవకాశాలపై కొంత ఒత్తిడి పెంచుతుంది. తదుపరి మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన చేయకపోతే, ప్లేఆఫ్స్ రేసులో వెనకబడే అవకాశం ఉంది.

Tags:    

Similar News