IND vs AUS: వన్దే మ్యాచ్‌కు వర్షం ముప్పు

IND vs AUS: ఆందోళనలో క్రికెట్ ఫ్యాన్స్

Update: 2023-03-19 02:10 GMT

IND vs AUS: వన్దే మ్యాచ్‌కు వర్షం ముప్పు

IND vs AUS: ఏపీలో తుఫాన్ ప్రభావంతో వైజాగ్‌లో జరిగే క్రికెట్ మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆదివారం విశాఖపట్నంలో వైఎస్సార్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య అంతర్జాతీయ వన్డే మ్యాచ్ జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ రెండో మ్యాచ్‌ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

అయితే శనివారం రాత్రి నుంచే విశాఖపట్నంలో వర్షం కురుస్తోంది. విశాఖలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అలవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో మ్యాచ్‌కు అంతరాయం తప్పకపోవచ్చని తెలిపింది. ఎంతటి పెద్ద వర్షం పడినా అరగంటలో మైదానంలో వర్షం నీరు బయటకు పోయేలా అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ ఇక్కడ ఉందని స్టేడియం నిర్వాహకులు చెబుతున్నారు. కానీ వర్షం అడపాదడపా కొనసాగితే మాత్రం మ్యాచ్ నిర్వహించడం కష్టమని తెలుస్తోంది. విశాఖలో ఇప్పటి వరకు జరిగిన 9 వన్డేల్లో వర్షంతో ఒకసారి మాత్రమే మ్యాచ్ రద్దయింది. ఒకవేళ వర్షంతో అంతరాయం కలిగించినా కనీసం టీ20 తరహా మ్యాచ్ అయినా జరగాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్టేడియంలో 28వేల సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. టికెట్ల విక్రయాలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

శనివారం సాయంత్రం భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ముంబై నుంచి విశాఖ చేరుకున్నారు. క్రికెటర్లు విశాఖలో అడుగుపెట్టే సమయానికే వర్షం స్వాగతం పలికింది. ఇరు జట్ల ఆటగాళ్లు విమానాశ్రయం నుంచి నేరుగా బస ఏర్పాటు చేసిన రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్లారు. మరోవైపు వన్డే మ్యాచ్‌తో విశాఖపట్నం సిటీ పోలీస్‌ కమిషనర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిటీలో, స్టేడియం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

Tags:    

Similar News