Power Outage : విద్యుత్ అంతరాయం.. స్టేడియంలో కమ్ముకున్న చీకట్లు.. నిలిచిపోయిన మ్యాచ్
Power Outage : స్పెయిన్, పోర్చుగల్‌లో ఊహించని విద్యుత్ అంతరాయం లక్షలాది మంది జీవితాలను అస్తవ్యస్తం చేసింది. స్పెయిన్ పవర్ గ్రిడ్‌లో భారీ అంతరాయం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే, దీనికి కారణం ఇంకా తెలియరాలేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ట్రాఫిక్ లైట్లు, విమానాశ్రయాలు, మాడ్రిడ్ అండర్‌గ్రౌండ్ సేవలు నిలిచిపోయాయి. ఈ ఘటన క్రీడా ప్రపంచాన్ని కూడా తాకింది. విద్యుత్ అంతరాయం కారణంగా మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సోమవారం జరగాల్సిన మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. మనోలో శాంటానా స్టేడియంలో రౌండ్ 32 మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ విద్యుత్ అంతరాయం సంభవించిన సమయంలో 15వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్, జాకబ్ ఫెర్న్‌లీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. గ్రిగోర్ దిమిత్రోవ్ 6-4, 5-4తో ఆధిక్యంలో ఉన్నాడు. సరిగ్గా అప్పుడే స్టేడియంలో ఒక్కసారిగా లైట్లు ఆగిపోయాయి. మధ్యాహ్నం 12:34 గంటలకు రెండు సింగిల్స్ మ్యాచ్‌లు, ఒక డబుల్స్ మ్యాచ్ జరుగుతుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ATP టూర్ తెలిపింది. ఈ అంతరాయం ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ సిస్టమ్‌ను ప్రభావితం చేయడంతో పాటు మనోలో శాంటానా స్టేడియం లోపల కోర్టుపై ఉన్న స్పైడర్ క్యామ్ కూడా నిలిచిపోయింది. దీంతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది.
మరోవైపు, నాలుగో సీడ్ కోకో గాఫ్ బెలిండా బెన్సిక్‌ను 6-4, 6-2తో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.మ్యాచ్ అనంతరం అరాంట్క్సా సాంచెజ్ స్టేడియంలో ఆమె ఇంటర్వ్యూ జరుగుతుండగా మైక్రోఫోన్ పవర్ పోవడంతో దానిని మధ్యలోనే ఆపేశారు. ఈ ఘటన తర్వాత మాడ్రిడ్ ఓపెన్ అధికారిక ఖాతా Xలో "సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి మేము కృషి చేస్తున్నాము" అని పోస్ట్ చేసింది.
ఈ బ్లాక్‌అవుట్ యూరప్‌లోని అనేక దేశాలపై ప్రభావం చూపింది. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మాడ్రిడ్ నుండి లిస్బన్ వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభావిత నగరాల్లో మాడ్రిడ్, బార్సిలోనా, లిస్బన్, సెవిల్లే, పోర్టో వంటి పెద్ద కేంద్రాలు ఉన్నాయి. దీంతో స్పెయిన్‌లో పరిస్థితిని చక్కదిద్దడానికి సంక్షోభ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు.