Pakistan: ఈ ఏడాది భారత్ లో మహిళల వరల్డ్ కప్.. పాక్ మహిళా టీమ్ ఆడదన్న పీసీబీ
Pakistan: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 నిర్వహణ హక్కులు భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో తమ జట్టు భారత్ లో పర్యటించదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మరోసారి స్పష్టం చేశారు. హైబ్రిడ్ మోడల్స్ లోనే పాల్గొంటుందని తెలిపారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తటస్థ వేదికలపైనే ఆడుతుందని వెల్లడించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో పాకిస్తాన్ లో కాకుండా తటస్థ వేదికపైనే భారత్ ఆడింది. మేము కూడా అలాగే చేస్తాము. ఎవరైనా ఒప్పందాన్ని గౌరవించాల్సిందే అని మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. ఈ టోర్నమెంట్ కు భారత్ ఆతిథ్యం ఇస్తున్నందున తటస్థ వేదికను ఎంపిక చేసే బాధ్యత కూడా ఆ దేశానిదే అని తెలిపారు.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ను ఈ ఏడాది సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు నిర్వహించనున్నారు. గత మార్చిలో లాహోర్ లో నిర్వహించిన క్వాలిఫైయర్ మ్యాచుల్లో విజయం సాధించిన పాక్ జట్టు..టోర్నమెంట్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. అటు బంగ్లాదేశ్ కూడా అర్హత సాధించింది.