పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఛాంపియన్స్ ట్రోఫీతో రూ. 869 కోట్లు నష్టపోయిన పాకిస్థాన్

PCB losses due to Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం రావల్పిండి, కరాచీ, లాహోర్ నగరాల్లోని స్టేడియంలను...

Update: 2025-03-17 09:05 GMT

ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలతో రూ. 869 కోట్లు నష్టపోయిన పాకిస్థాన్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తో పాకిస్తాన్ రూ. 869 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. సాధారణంగా క్రీడల పోటీలు నిర్వహించే క్రీడా సంస్థలు భారీ మొత్తంలో డబ్బు సంపాదించుకోవడం జరుగుతుంది. ఆయా క్రీడా సంస్థలకు క్రీడల పోటీలు అనేవి మంచి ఆదాయ మార్గంగా కనిపిస్తుంటాయి. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో మాత్రం పాకిస్థాన్‌కు లాభం రాకపోగా 85 అమెరికన్ మిలియన్ డాలర్ల నష్టం వచ్చిందని తాజా నివేదిక చెబుతోంది. ఇప్పటికే సొంత గడ్డపై ఆడి కూడా ఘోర పరాజయం పాలయ్యామనే అవమానంతో ఉన్న పాకిస్థాన్‌కు ఈ భారీ నష్టం న్యూస్ మరింత నిరాశకు గురిచేస్తోంది.

లాహోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఓపెనింగ్ గ్రూప్ A మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమిపాలైంది. ఆ తరువాత దుబాయ్‌లో భారత్‌తో మరో మ్యాచ్ ఆడి అక్కడ కూడా ఓడిపోయింది. దీంతో సొంత మైదానంలో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్‌తోనే ఛాంపియన్స్ ట్రోఫీ నుండి చాప చుట్టేయాల్సి వచ్చింది.

తాజాగా టెలిగ్రాఫ్ ఇండియాలో ప్రచురించిన ఒక వార్తా కథనం ప్రకారం పాకిస్తాన్‌కు ఈ ఓటములతో పాటు భారీ నష్టం కూడా వాటిల్లింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం రావల్పిండి, కరాచీ, లాహోర్ నగరాల్లోని స్టేడియంలను అభివృద్ధి చేశారు. అందుకోసం పాకిస్థాన్ 1800 కోట్ల పాకిస్తాన్ రూపాయలు ఖర్చు పెట్టింది.

మొదట 900 నుండి 1000 కోట్ల లోపే బడ్జెట్ అంచనాలు వేసుకున్నారు. కానీ పనులు పూర్తయ్యేటప్పటికి అది 1800 కోట్లకు చేరుకుంది. అనుకున్నదానికంటే 50 శాతం ఎక్కువ బడ్జెట్ ఖర్చు అయింది. మరో 40 మిలియన్ డాలర్లు ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహక ఏర్పాట్ల కోసం ఖర్చు చేశారు.

పాకిస్తాన్ అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినప్పటికీ వారికి ఆదాయం మాత్రం రాలేదు. మ్యాచ్ ఫీ రూపంలో కేవలం 6 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. టికెట్స్ సేల్స్, స్పాన్సర్‌షిప్స్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఘోరంగా విఫలమైంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ రూ. 869 కోట్లు నష్టపోయినట్లు ఆ నివేదిక స్పష్టంచేసింది.

నష్టాలను భర్తీ చేసుకునేందుకు కఠిన నిర్ణయాలు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఇకపై నిర్వహించబోయే నేషనల్ T20 ఛాంపియన్‌షిప్ ట్రోఫీలో 90 శాతం మ్యాచ్ ఫీ కోత విధిస్తున్నారు. రిజర్వ్ ప్లేయర్స్ కు ఇచ్చే పేమెంట్స్ ను కూడా 87.5 శాతం తగ్గించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇకపై ఆటగాళ్లకు 5 స్టార్ హోటల్స్ కాకుండా తక్కువ ఖర్చులో అయిపోయేలా ఎకానమి హోటల్స్ లోనే బస ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News