Lionel Messi: ఘోర ప్రమాదం.. మెస్సీ సోదరికి తీవ్ర గాయాలు.. పెళ్లి వాయిదా
Lionel Messi: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన సోదరి మరియా సోల్ (32) అమెరికాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది.
Lionel Messi: ఘోర ప్రమాదం.. మెస్సీ సోదరికి తీవ్ర గాయాలు.. పెళ్లి వాయిదా
Lionel Messi: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన సోదరి మరియా సోల్ (32) అమెరికాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. మయామి రోడ్డుపై ప్రయాణిస్తున్న ఆమె కారు అదుపుతప్పి కాంక్రీట్ గోడను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో మరియాకు రెండు వెన్నుపూసలు విరగడం, మడమ, చేయి విరగడం, అలాగే తీవ్రమైన కాలిన గాయాలు అయినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, అయితే పూర్తిగా కోలుకోవడానికి సమయం పట్టే అవకాశముందని తెలిపారు.
ఈ నేపథ్యంలో త్వరలో జరగాల్సిన మరియా వివాహం వాయిదా పడింది. ఇంటర్ మయామి అండర్-19 జట్టు కోచ్ జూలియన్ ‘తులి’ అరెల్లానోతో జనవరి 3, 2026న ఆమె వివాహం జరగాల్సి ఉండగా, వైద్యుల సూచన మేరకు పెళ్లిని వాయిదా వేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
అర్జెంటీనా టీవీ జర్నలిస్ట్ ఏంజెల్ డి బ్రిటో మాట్లాడుతూ, తాను మరియా సోల్ తల్లితో మాట్లాడానని, ప్రమాదం నుంచి ఆమె ప్రాణాలతో బయటపడటం ఊరట కలిగించే విషయమని తెలిపారు. ఈ వార్త వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా మెస్సీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు.
మరియా సోల్ ఫ్యాషన్ రంగంలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ‘బికినిస్ రియో’ బ్రాండ్ వ్యవస్థాపకురాలిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఈ ప్రమాదం ఆమె వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా, వృత్తి జీవితానికీ తాత్కాలిక ఆటంకంగా మారింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని, పరిస్థితి మెరుగుపడుతోందని కుటుంబ వర్గాలు వెల్లడించాయి.