Kagiso Rabada: గుజరాత్ టైటాన్స్ బౌలర్ డ్రగ్స్ తీసుకున్నాడా? అతనిపై జీవితకాల నిషేధం పడనుందా?
ఇది తన జీవితాన్ని నిర్వచించే సంఘటన కాకూడదని, భవిష్యత్తులో మరింత కష్టపడి, అంకితభావంతో మళ్లీ ఆడతానని స్పష్టం చేశాడు.
Kagiso Rabada: గుజరాత్ టైటాన్స్ బౌలర్ డ్రగ్స్ తీసుకున్నాడా? అతనిపై జీవితకాల నిషేధం పడనుందా?
గుజరాత్ టైటాన్స్ బౌలర్, దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా ఐపీఎల్ 2025 మధ్యలో అకస్మాత్తుగా స్వదేశానికి వెళ్లిపోవడం వెనుక అసలు కారణం తాజాగా బయటపడింది. తొలుత ఇది వ్యక్తిగత కారణమని ఫ్రాంచైజీ చెప్పినప్పటికీ, ఇప్పుడు రబాడా స్వయంగా వెల్లడించిన వివరాలు అసలు విషయం మరోలా ఉన్నట్లు చెబుతున్నాయి. ఆయన వాడిన మత్తు పదార్థానికి సంబంధించి వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) నియమాలకు అనుగుణంగా ప్రొవిజనల్ సస్పెన్షన్ విధించబడి ఉన్నాడు.
రబాడా తనపై వచ్చిన నిర్ధారణల కారణంగా తాత్కాలికంగా క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపాడు. తాను మత్తు పదార్థాన్ని వాడినట్టు తన శరీర పరీక్షలో బయటపడిందని, దీనికి బాధ్యత తీసుకుంటున్నానని వెల్లడించాడు. అయినప్పటికీ, ఆ పదార్థం ఏమిటన్నది, అది పోటీ సమయంలోనా లేక బయట జరిపిన పరీక్షలోనా అన్నది స్పష్టత ఇవ్వలేదు.
వాడా గైడ్‌లైన్స్ ప్రకారం, మత్తు పదార్థాల వాడకానికి సంబంధించి శిక్ష మూడు నెలల నుంచి నాలుగు సంవత్సరాల వరకూ ఉండే అవకాశముంది. కోకైన్, హెరోయిన్, ఎండిఎంఏ, గంజాయి వంటి పదార్థాలు 'సబ్టాన్స్ ఆఫ్ అబ్యూస్' జాబితాలో ఉంటాయి. ఇవి ఆటతీరు మెరుగుపర్చేందుకు కాకుండా ఇతర కారణాలకై వాడినా, కఠిన నిబంధనలు అమలు అవుతాయి.
ఐపీఎల్‌లో రబాడా మొదటి రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌పై ఒక్కో వికెట్ తీశాడు. అతని గైర్హాజరీ తర్వాత గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ బాధ్యతను సిరాజ్, ప్రసిద్ధ్, ఇషాంత్, కోట్జీ లాంటి ఆటగాళ్లు భుజాలపై వేసుకున్నారు. ఇక రబాడా క్రికెట్‌లో తన తిరిగి ప్రవేశాన్ని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఇది తన జీవితాన్ని నిర్వచించే సంఘటన కాకూడదని, భవిష్యత్తులో మరింత కష్టపడి, అంకితభావంతో మళ్లీ ఆడతానని స్పష్టం చేశాడు.