India Vs England : 587 పరుగులు... అయినా గెలుపు గ్యారెంటీ లేదా? ఎడ్జ్‌బాస్టన్‌లో అసలు ట్విస్ట్ ఇదే!

India Vs England: లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా, రెండో టెస్టులో మాత్రం అదరగొట్టింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో, తొలి 2 రోజుల్లోనే టీమిండియా ఇంగ్లాండ్‌ను పూర్తిగా బ్యాక్‌ఫుట్‌లోకి నెట్టేసింది.

Update: 2025-07-04 03:14 GMT

India Vs England: లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా, రెండో టెస్టులో మాత్రం అదరగొట్టింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో, తొలి 2 రోజుల్లోనే టీమిండియా ఇంగ్లాండ్‌ను పూర్తిగా బ్యాక్‌ఫుట్‌లోకి నెట్టేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదిరిపోయే డబుల్ సెంచరీ చేయడంతో, టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 587 పరుగులు చేసి పటిష్టమైన స్థితిలో నిలిచింది. అంత పెద్ద స్కోర్ చేస్తే, టీమిండియానే గెలుస్తుంది కదా అనుకుంటున్నారా? కానీ అలా జరగకపోవచ్చు అంట.. ఈ మాట గత రికార్డులు చెబుతున్నాయి.

జులై 2న ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ మొదలైంది. మొదటి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 310 పరుగులు చేసి, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో క్రీజులో ఉన్నాడు. రెండో రోజు ఆటలో గిల్ అదరగొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో తన మొదటి డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఏకంగా 269 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. అతని రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ దెబ్బకి, టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 587 పరుగులు చేసింది. టెస్ట్ క్రికెట్‌లో ఇది చాలా పెద్ద స్కోర్.

టెస్ట్ క్రికెట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 550 లేదా 600 పరుగులు చేస్తే, ఆ టీమ్ గెలవడం లేదా మ్యాచ్ డ్రా అవ్వడం జరుగుతుంది. ఈ భారీ స్కోర్ టీమిండియాకు కాస్త ప్రశాంతతను ఇవ్వొచ్చు. కానీ, గత మూడేళ్ల గణాంకాలు చూస్తే మాత్రం టీమిండియా అభిమానులకు టెన్షన్ తప్పదు. 2022 తర్వాత, ఇంగ్లాండ్‌పై ఏ టీమ్ అయినా ఒక ఇన్నింగ్స్‌లో 550 పరుగుల కంటే ఎక్కువ స్కోర్ చేయడం ఇది నాలుగోసారి మాత్రమే. కానీ, అంతకు ముందున్న మూడు సందర్భాల్లోనూ, 550 పరుగులకు పైగా స్కోర్ చేసినా, ఆ మ్యాచ్‌లను ఇంగ్లాండే గెలుచుకుంది. 2022లో పాకిస్తాన్ రావల్పిండిలో 579 పరుగులు చేసింది. అదే ఏడాది న్యూజిలాండ్ నాటింగ్‌హామ్‌లో 553 పరుగులు చేసింది. ఆ తర్వాత 2024లో పాకిస్తాన్ ముల్తాన్‌లో 556 పరుగులు చేసింది. ఈ మూడు మ్యాచ్‌లలోనూ ప్రత్యర్థులు భారీ స్కోర్లు చేసినప్పటికీ, చివరకు విజయం మాత్రం ఇంగ్లాండ్‌దే అయ్యింది.

587 పరుగులు చేసి టీమిండియా ఆటగాళ్లు కాస్త ఊపిరి పీల్చుకుని ఉంటారు. కానీ, ఈ గణాంకాలు చూశాక కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ కు మాత్రం టెన్షన్ పక్కా. అయితే, భారత బౌలర్లు మ్యాచ్‌ను ప్రారంభించిన తీరు చూస్తే, ఈ రికార్డును మార్చేయొచ్చు అనే ఆశలు కనిపిస్తున్నాయి. రెండో రోజు ఆట ముగిసేసరికి, ఇంగ్లాండ్ కేవలం 77 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అది కూడా, యువ బౌలర్ ఆకాష్ దీప్ మూడో ఓవర్‌లోనే వరుసగా రెండు బంతుల్లో బెన్ డకెట్, ఆలీ పోప్ వికెట్లను పడగొట్టాడు. ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ కూడా జేక్ క్రాలీని పెవిలియన్‌కు పంపాడు. మరి భారత బౌలర్లు ఈ మంచి ప్రారంభాన్ని కొనసాగించి, ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోగలరా? ఆ గణాంకాల చరిత్రను తిరగరాసి, టీమిండియాను గెలిపించగలరా? అనేది చూడాలి.

Tags:    

Similar News