IND vs SA : రాయ్‌పూర్‌లో టీమిండియాకు ఘోర పరాజయం..కోహ్లీ-రుతురాజ్ సెంచరీలు వృథా
రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. భారీ స్కోరు సాధించినా, దక్షిణాఫ్రికా జట్టు అద్భుతమైన ఛేజింగ్‌తో భారత్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది.
IND vs SA : రాయ్‌పూర్‌లో టీమిండియాకు ఘోర పరాజయం..కోహ్లీ-రుతురాజ్ సెంచరీలు వృథా
IND vs SA : రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. భారీ స్కోరు సాధించినా, దక్షిణాఫ్రికా జట్టు అద్భుతమైన ఛేజింగ్‌తో భారత్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై భారత్ 358 పరుగులు చేసినా విజయం దక్కలేదు. దీంతో సిరీస్ ఇప్పుడు 1-1తో సమం అయ్యింది. విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్‌ల సెంచరీలు జట్టును గెలిపించలేక పోవడం బాధాకరం.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ మరోసారి భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (102) తన 53వ వన్డే సెంచరీని నమోదు చేయగా, యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (105) కేవలం 77 బంతుల్లోనే తన కెరీర్‌లో మొదటి వన్డే సెంచరీ కొట్టాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆఖర్లో కేవలం 43 బంతుల్లో 66 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో స్కోరును 350 దాటించాడు.
అయితే, రవీంద్ర జడేజా (27 బంతుల్లో 24), వాషింగ్టన్ సుందర్ (8 బంతుల్లో 1), యశస్వి జైస్వాల్ (38 బంతుల్లో 22) వంటి ఆటగాళ్లు నెమ్మదిగా ఆడటం వల్ల భారత్ 400 పరుగుల మార్కును చేరుకోలేకపోయింది. ముఖ్యంగా ఆఖరి 10 ఓవర్లలో కేవలం 74 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఈ చిన్న తేడాయే మ్యాచ్ ఫలితంపై భారీ ప్రభావం చూపింది.
359 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఆరంభంలోనే క్వింటన్ డికాక్ (8) వికెట్ కోల్పోయింది. కానీ, అక్కడి నుంచి వైస్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (110) భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. మార్క్రమ్ 53 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతని క్యాచ్ జారవిడుచుకోవడం భారత్‌కు చాలా నష్టం కలిగించింది. మార్క్రమ్, కెప్టెన్ టెంబా బావుమా (46)తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. 88 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన మార్క్రమ్, ఆ తర్వాత ఔటైనా అప్పటికే మ్యాచ్ వారి వైపు మళ్లింది.
మార్క్రమ్ ఔటయ్యాక భారత్ తిరిగి పుంజుకుంటుందనుకుంటే, యువ ఆటగాళ్లు మాథ్యూ బ్రీట్జ్‌కే, డేవాళ్డ్ బ్రెవిస్ కలిసి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. బ్రెవిస్ కేవలం 34 బంతుల్లోనే 54 పరుగులు చేసి తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్‌పై ఒత్తిడి పెంచాడు. బ్రీట్జ్‌కే కూడా 68 పరుగుల అద్భుత హాఫ్ సెంచరీతో జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. చివర్లో టీమిండియా కొన్ని వికెట్లు తీసినా ప్రయోజనం లేకపోయింది. కార్బిన్ బాష్ (29) వేగంగా పరుగులు చేసి 49.2 ఓవర్లలోనే జట్టును గెలిపించాడు. ఇది భారత్‌లో సౌతాఫ్రికా ఛేదించిన అతిపెద్ద రన్ టార్గెట్ కావడం విశేషం. ఈ ఓటమితో సిరీస్ 1-1తో సమం అయింది. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి వన్డే డిసెంబర్ 6న విశాఖపట్నంలో జరగనుంది.