Champions Trophy 2025: ఛాంపియన్ గా భారత్ .. కనిపించని పీసీబీ చైర్మన్.. వివాదాస్పదంగా అక్తర్ ప్రకటన
Champions Trophy: 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. కానీ టోర్నమెంట్ ఫైనల్ విజేతకు అవార్డుల ప్రదానోత్సవం జరిగినప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుండి ఏ అధికారి కనిపించలేదు.
Champions Trophy: 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. కానీ టోర్నమెంట్ ఫైనల్ విజేతకు అవార్డుల ప్రదానోత్సవం జరిగినప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుండి ఏ అధికారి కనిపించలేదు. దీంతో వివాదం మొదలైంది. దీనికి షోయబ్ అక్తర్ ప్రకటన అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని ఆయన చెప్పడం ద్వారా అది మరింత ముదిరింది. అయితే, దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ స్పష్టత ఇచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం పీసీబీ ఛైర్మన్ ప్రజెంటేషన్ వేడుకలోనే కాకుండా దుబాయ్‌లో కూడా ఎందుకు కనిపించలేదో స్పష్టం అయింది.
వసీం అక్రమ్ ప్రకారం..పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఫైనల్ కోసం దుబాయ్ చేరుకోకపోవడానికి అసలు కారణం ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడమే. స్పోర్ట్స్ సెంట్రల్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో దీని గురించి సమాచారం ఇస్తూ..‘‘నాకు తెలిసినంత వరకు పిసిబి చైర్మన్ ఆరోగ్యం బాగాలేదు. అందుకే ఆయన ఫైనల్‌కు వెళ్లలేకపోయారని అన్నారు. పీసీబీ నుండి ఇద్దరు అధికారులు సుమేర్ అహ్మద్, ఉస్మాన్ వాలా - అక్కడికి చేరుకున్నప్పటికీ వారు వేదికపైకి ఎందుకు వెళ్లలేదో తెలియదని వసీం అక్రమ్ అన్నారు.
అంతకుముందు, షోయబ్ అక్తర్ కూడా ఫైనల్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి పీసీబీ చైర్మన్ లేదా మరే ఇతర అధికారి లేకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది తన అవగాహనకు మించినదని ఆయన అన్నారు. ప్రపంచ వేదిక మ్యాచ్‌లో ఇలాంటిది జరిగితే ఆందోళన చెందాల్సిన విషయమే అన్నారు. ఆతిథ్య దేశం తరఫున వారు వేదికపై ఉండాలన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. ఇది టీం ఇండియా గెలుచుకున్న మూడవ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. అంతకుముందు అది 2002, 2013 లలో ఈ టైటిల్ గెలుచుకుంది. ఛాంపియన్ అయిన తర్వాత భారత జట్టు ఐసిసి చైర్మన్ జై షా నుండి ట్రోఫీని అందుకుంది.