ICC T20 World Cup 2026: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ.. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పుల్లేవు!
భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తిరస్కరించింది.
ICC T20 World Cup 2026: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ.. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పుల్లేవు!
భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తిరస్కరించింది. భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) రాసిన లేఖకు ఐసీసీ నుంచి స్పష్టమైన సమాధానం వచ్చింది. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని, టోర్నీకి హాజరు కావడం సభ్య దేశాల బాధ్యత అని ఐసీసీ తేల్చి చెప్పింది.
ఐసీసీ ఛైర్మన్ జై షా నేతృత్వంలో జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. భారత్‌లో నిర్వహించాల్సిన మ్యాచ్‌లను మరో దేశానికి మార్చడం సాధ్యం కాదని బీసీబీకి స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే, భారత్‌కు వచ్చి మ్యాచ్‌లు ఆడకపోతే పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ముస్తాఫిజుర్ వివాదమే కారణమా?
ఈ వివాదానికి ప్రధాన కారణంగా బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ అంశమే నిలుస్తోంది. ఐపీఎల్‌లో భాగంగా కేకేఆర్ జట్టులో ఉన్న ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించడంతో బంగ్లాదేశ్‌లో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించారు.
అంతేకాదు, టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి మార్చాలని బీసీబీ డిమాండ్ చేసింది. అయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో గానీ, బీసీసీఐలోని ఇతర కీలక సభ్యులతో గానీ చర్చించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నిర్ణయం బీసీసీఐ అత్యున్నత స్థాయి నుంచే వచ్చిందని సమాచారం.
భద్రతపై బీసీబీ ఆందోళన
ముస్తాఫిజుర్ వ్యవహారం తర్వాత భారత్‌లో తమ జట్టు భద్రతపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు రావడం సాధ్యం కాదని బీసీబీ అధికారికంగా ప్రకటించింది. దీనిపై స్పందించిన ఐసీసీ.. ఇప్పటి షెడ్యూల్ ప్రకారమే టోర్నీ మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది.
టోర్నీ షెడ్యూల్ ఇలా..
టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకల్లో నిర్వహించనున్నారు. బంగ్లాదేశ్ తన గ్రూప్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైలో ఆడాల్సి ఉంది. ఐసీసీ తాజా నిర్ణయంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది.