CSK vs RCB: చెన్నైకి భారీ షాక్‌.. ఆర్సీబీ మ్యాచ్‌కు కీలక ప్లేయర్ దూరం!

CSK vs RCB: గాయంతో మతీష పథిరానా మరోసారి ఐపీఎల్ 2025 మ్యాచ్‌కు దూరం కానున్నాడు.

Update: 2025-03-27 16:51 GMT

CSK vs RCB: చెన్నైకి భారీ షాక్‌.. ఆర్సీబీ మ్యాచ్‌కు కీలక ప్లేయర్ దూరం!

CSK vs RCB: చెన్నై సూపర్ కింగ్స్‌కు కీలకమైన మ్యాచ్‌కు ముందు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీష పథిరానా, ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న పోరుకు అందుబాటులో ఉండడని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశారు. మార్చి 28న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే పథిరానా గాయం నుంచి కోలుకుంటుండటంతో ఈ మ్యాచ్‌ను కూడా మిస్సవుతున్నారు.

ఇది ఈ సీజన్‌లో అతను మిస్సయ్యే రెండో మ్యాచ్ కావడం విశేషం. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై జరిగిన పోరులోనూ ఆయన జట్టులో లేరు. ఫ్లెమింగ్ స్పష్టంగా పథిరానా అందుబాటులో లేరని చెప్పినప్పటికీ, గాయం స్వభావం ఏంటన్న విషయాన్ని వెల్లడించలేదు. ఎప్పటికి తిరిగి మైదానంలోకి వస్తారన్నదానిపై కూడా స్పష్టత లేదు.

పథిరానా 2022లో గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ మ్యాచ్‌లో జట్టు గెలవకపోయినప్పటికీ, 2 వికెట్లు తీసి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 2023లో మాత్రం సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా నిలవడంలో పథిరానా కీలక పాత్ర పోషించారు. 12 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసి అభిమానుల మనసు దోచుకున్నారు. 2024లోనూ అదే ఫామ్ కొనసాగించగా, కేవలం 6 మ్యాచుల్లోనే 13 వికెట్లు తీశారు. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో చివరికి టోర్నీ నుంచి తప్పుకున్నారు.

మొత్తంగా ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటి వరకు 20 మ్యాచ్‌లు ఆడిన పథిరానా, 34 వికెట్లు పడగొట్టి 7.68 ఎకానమీతో నిలబడ్డారు. ముంబై ఇండియన్స్‌పై 4 వికెట్లు తీసిన ప్రదర్శన ఆయన బెస్ట్‌గా నిలిచింది. కానీ ఈ సీజన్‌లో ఇంకా ఒక్క మ్యాచ్‌కూ బరిలోకి దిగకపోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. ఇక ఈ సీజన్‌లో చెన్నై, బెంగళూరు రెండు జట్లు గెలుపుతో తమ ప్రస్థానాన్ని ప్రారంభించాయి. కేకేఆర్‌ను చిత్తుచేసిన ఆర్సీబీ, ముంబైపై విజయం సాధించిన సీఎస్‌కే మళ్లీ ప్రత్యర్థులుగా తలపడటంతో ఈ మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది. అయితే పథిరానా లేని పరిస్థితిలో చెన్నై పేస్ అటాక్ ఎలా నిలబడుతుంది అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News