IPL 2021DC vs RCB: ఢిల్లీ పై బెంగళూరు విజయం

IPL 2021DC vs RCB: విధ్వంసక బ్యాటింగ్‌తో హెట్‌మయర్‌ కలవర పెట్టినా.. ప్రత్యర్థిని ఒక్క పరుగు దూరంలో ఆపేసింది.

Update: 2021-04-28 01:15 GMT

IPL 2021DC vs RCB:(File Image) 

IPL 2021 DC vs RCB: ఐపీఎల్ 2021లో భాగంగా భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ట మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. విధ్వంసక బ్యాటింగ్‌తో హెట్‌మయర్‌ కలవర పెట్టినా.. ప్రత్యర్థిని ఒక్క పరుగు దూరంలో ఆపేసింది. ఆఖరి ఓవర్లో సిరాజ్‌ చక్కగా బౌలింగ్‌ చేసి దిల్లీ ఆశలకు చెక్‌ పెట్టాడు. టోర్నీలో అయిదో విజయం సాధించిన బెంగళూరు.. పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది.

బెంగళూరు అదరగొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. డివిలియర్స్‌ (75 నాటౌట్‌; 42 బంతుల్లో 3×4, 5×6) చెలరేగడంతో మొదట బెంగళూరు 5 వికెట్లకు 171 పరుగులు సాధించింది. అవేష్‌ ఖాన్‌ (1/24), ఇషాంత్‌ శర్మ (1/26), మిశ్రా (1/27) బంతితో రాణించారు. ఛేదనలో దిల్లీ 4 వికెట్లకు 170 పరుగులు చేయగలిగింది. కెప్టెన్‌ పంత్‌ (58 నాటౌట్‌; 48 బంతుల్లో 6×4) టాప్‌ స్కోరర్‌గా నిలిచినా.. ధాటిగా ఆడలేకపోవడం దిల్లీకి ప్రతికూలంగా మారింది. హెట్‌మయర్‌ (53 నాటౌట్‌; 25 బంతుల్లో 2×4, 4×6) సంచలన ఇన్నింగ్స్‌తో బెంగళూరుకు చెమటలు పట్టించాడు.

హెట్‌మయర్‌ మెరిసినా..: లక్ష్యఛేదనలో ఆరంభంలోనే దిల్లీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 28 పరుగులకే ధావన్‌ (6), స్మిత్‌ (4) వెనుదిరిగారు. పృథ్వీ షా (21; 18 బంతుల్లో 3×4) నిలిచినా.. మరోవైపు కెప్టెన్‌ పంత్‌ ఉన్నా పరుగులు వేగంగా రాలేదు. 7 ఓవర్లకు స్కోరు 46/2. తర్వాతి ఓవర్లో హర్షల్‌ ఆఫ్‌స్టంప్‌ ఆవల దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి షా నిష్క్రమించాడు. ఆ తర్వాత కూడా పరుగులు కష్టంగానే వచ్చాయి.

బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పంత్‌ వేగం అందుకోలేదు. స్టాయినిస్‌ (22) కూడా ధాటిగా బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. 11 ఓవర్లకు స్కోరు 69/3. తర్వాతి ఓవర్లో స్టాయినిస్‌ రెండు ఫోర్లు, ఆ తర్వాతి ఓవర్లో పంత్‌ రెండు ఫోర్లు కొట్టడంతో ఇన్నింగ్స్‌కు కాస్త ఊపొచ్చింది. కానీ కీలక సమయంలో స్టాయినిస్‌ను హర్షల్‌ (2/37) వెనక్కి పంపాడు. క్రీజులోకి వచ్చిన హెట్‌మయర్‌ దూకుడుగానే ఆడినా.. పంత్‌ మాత్రం గేర్‌ మార్చలేకపోయాడు. చివరి మూడు ఓవర్లలో దిల్లీ 46 పరుగులు చేయాల్సిన స్థితిలో బెంగళూరు మెరుగ్గా కనిపించింది. కానీ జేమీసన్‌ వేసిన 18వ ఓవర్లో మూడు సిక్స్‌లు కొట్టడం ద్వారా బెంగళూరుకు షాకిచ్చిన హెట్‌మయర్‌.. దిల్లీలో ఆశలు రేపాడు. 19వ ఓవర్లలో హర్షల్‌ 11 పరుగులు ఇవ్వడంతో ఆఖరి ఓవర్లో దిల్లీకి 14 పరుగులు అవసరమయ్యాయి. కానీ సిరాజ్‌ (1/44) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. తొలి నాలుగు బంతుల్లో నాలుగే పరుగులిచ్చాడు. అయిదో బంతి ఫుల్‌టాస్‌ వేయగా.. పంత్‌ ఫోర్‌ కొట్టాడు. చివరి బంతికి దిల్లీకి సిక్స్‌ అవసరమైంది. కానీ సిరాజ్‌ ఆఫ్‌స్టంప్‌ ఆవల లో ఫుల్‌ టాస్‌ వేయడంతో పంత్‌ ఫోర్‌ మాత్రమే కొట్టగలిగాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు తొలి 3 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత వరుస ఓవర్లలో ఓపెనర్లు కోహ్లి (12), పడిక్కల్‌ల వికెట్లు కోల్పోయింది. అవేష్‌ ఖాన్‌ షార్ట్‌ పిచ్‌ బంతిని కోహ్లి వికెట్ల మీదికి ఆడుకోగా.. పడిక్కల్‌ను ఇషాంత్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ దశలో పటీదార్‌కు తోడైన మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మిశ్రా, అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌ల్లో సిక్స్‌లు బాదేశాడు. అయితే 60/2తో బెంగళూరు కుదురుకుంటున్న దశలో మిశ్రా బౌలింగ్‌లో అతడు ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌.. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. అయితే ఎక్కువగా సింగిల్సే తీశాడు. పటీదారే కాస్త దూకుడు ప్రదర్శించాడు. స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూనే మిశ్రా, ఇషాంత్‌ ఓవర్లలో ఒక్కో సిక్స్‌ కొట్టాడు. 14 ఓవర్లకు స్కోరు 105/3. అక్కడి నుంచి డివిలియర్స్‌ వేగం పెంచాడు. అక్షర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో బౌలర్‌ తలమీదుగా సిక్స్‌ బాదేశాడు. కానీ అదే ఓవర్లో పటీదార్‌ ఔట్‌ కావడంతో 54 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత రబాడ బౌలింగ్‌లోనూ డివిలియర్స్‌ ఓ సిక్స్‌ దంచాడు. కానీ ఆఖరి ఓవర్లో (స్టాయినిస్‌) అతడి బ్యాటింగ్‌ అదరహో. కళ్లు చెదిరే షాట్లతో ఆ ఓవర్లో మూడు సిక్స్‌లు బాదిన డివిలియర్స్‌.. జట్టు స్కోరును 170 దాటించాడు. ఆ ఓవర్లో డివిలియర్స్‌ 22 పరుగులు సాధించాడు.

బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఏబీ డివిలియర్స్‌ ఆటే హైలైట్‌. ఆ జట్టు మంచి స్కోరు సాధించిందంటే కారణం అతడి మెరుపులే. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన ఏబీ.. ముగింపులో తనదైన శైలిలో రెచ్చిపోయాడు. రజత్‌ పటీదార్‌ (31; 22 బంతుల్లో 2×6) మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. మ్యాక్స్‌వెల్‌ (25; 20 బంతుల్లో 1×4, 2×6), పడిక్కల్‌ (17; 14 బంతుల్లో 3×4) కూడా బాగానే మొదలెట్టినా.. ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. 

Tags:    

Similar News