Cheteshwar Pujara: టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్.. అసలు కారణం ఇదే!
Cheteshwar Pujara: భారత టెస్ట్ క్రికెట్ అభిమానులకు గత ఆదివారం (ఆగస్టు 24) ఊహించని షాక్ తగిలింది.
Cheteshwar Pujara: టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్.. అసలు కారణం ఇదే!
Cheteshwar Pujara: భారత టెస్ట్ క్రికెట్ అభిమానులకు గత ఆదివారం (ఆగస్టు 24) ఊహించని షాక్ తగిలింది. టీమ్ ఇండియాలో టెస్ట్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న దిగ్గజ బ్యాట్స్‌మ్యాన్ చతేశ్వర్ పుజారా అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. గత రెండు సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ, పుజారా త్వరలో రిటైర్ అవుతారని ఎవరూ ఊహించలేదు. అయితే, కేవలం ఒకే వారంలో ఈ నిర్ణయం తీసుకున్నానని, దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని కూడా ఆయనే స్వయంగా వెల్లడించారు.
టీమ్ ఇండియాలో మూడో స్థానంలో చాలా కాలంపాటు బ్యాటింగ్‌లో రాణించిన పుజారా, తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఆదివారం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన టీమ్ ఇండియాకు, తన సహచరులకు, బీసీసీఐకి, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లకు, తనను సుదీర్ఘ కాలం పాటు ప్రోత్సహించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. భారత జట్టుకు ఆడటం తన చిన్ననాటి కల అని, ఆ కలను నెరవేర్చుకుని సుదీర్ఘకాలం క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగించానని ఆయన చెప్పారు. పుజారా తన చివరి మ్యాచ్‌ను జూన్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడారు. ఆయన టీమ్ ఇండియా తరఫున 103 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు.
అసలు కారణం అదేనా?
రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పుజారా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను గతంలో ఈ నిర్ణయం గురించి అంతగా ఆలోచించలేదు. కానీ, గత వారం రోజులుగా ఇదే విషయం గురించి ఆలోచిస్తున్నాను, ఇదే సరైన సమయమని నాకు అనిపించింది. అందుకే ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం నాకు, నా కుటుంబానికి ఒక గర్వకారణమైన క్షణం" అని తెలిపారు.
పుజారా తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక ఒక బలమైన కారణం ఉందని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దులీప్ ట్రోఫీ 2025 కోసం వెస్ట్ జోన్ జట్టులో ఆయనకు చోటు దక్కకపోవడం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా ఉండవచ్చని చెబుతున్నారు. అయితే, పుజారా ఈ విషయాన్ని అంతగా ప్రస్తావించలేదు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పుజారా స్పష్టం చేశారు. "మొదట నేను రంజీ ట్రోఫీలో ఆడాలని అనుకున్నాను. కానీ యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తే, వారు మరింత త్వరగా సిద్ధమవుతారని ఆలోచించాను. అందుకే ఇది నా వ్యక్తిగత నిర్ణయం" అని పుజారా వివరించారు.