Badminton Legend Lin-Dan Retires: చైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ 'లిన్ డాన్' సంచలన నిర్ణయం..

Badminton Legend Lin-Dan Retires: చైనా బ్యాడ్మింటన్ దిగ్గజం, రెండు సార్లు ఒలింపిక్ ఛాంపియన్ లిన్ డాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిటైర్‌ అవుతున్నట్లు శనివారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

Update: 2020-07-04 11:01 GMT

.Badminton Legend Lin-Dan Retires: చైనా బ్యాడ్మింటన్ దిగ్గజం, రెండు సార్లు ఒలింపిక్ ఛాంపియన్ లిన్ డాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిటైర్‌ అవుతున్నట్లు శనివారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్, 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో లిన్ డాన్ పసిడి పతకాలు సాధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపించిన లిన్ తన అద్భుతమైన ఆటతీరుతో చైనాకు ఎన్నో పతకాలు అందించారు. అతనితో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి ఆటగాళ్లు వణికేవారు. 36ఏళ్ల లిన్ డాన్ రిటైర్మెంట్ ప్రకటనతో వచ్చే ఏడాది జపాన్ వేదికగా జరగనున్న టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనబోరు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. దీంతో ఆ క్రీడల్లో లిన్ డాన్ పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.

లిన్ డాన్ తన ప్రత్యర్థి ఆటగాడు మలేషియా స్టార్, స్నేహితుడు లీ చోంగ్ వీ రిటైర్ అయిన ఏడాది తర్వాత లిన్ రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. లీ చోంగ్ వీ, లిన్ డాన్ లు దశాబ్దానికి పైగా క్రీడల్లో ఓ వెలుగువెలిగారు. లిన్ డాన్ 666 సింగిల్స్ విజయాలు, ఎన్నో పతకాలు సాధించారు. ఒలింపిక్‌ గేమ్స్‌, వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌, వరల్డ్‌కప్‌, థామస్‌ కప్‌, సుదీర్మన్‌ కప్‌, సూపర్‌ సిరీస్‌ మాస్టర్స్‌ ఫైనల్స్‌, ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌, ఆసియా గేమ్స్‌, ఆసియా ఛాంపియన్‌షిప్స్‌ ఇలా అన్ని టోర్నీల్లోనూ విజేతగా నిలిచారు.

" నాకు క్లిష్ట సమయంలో కుటుంబం, కోచ్‌లు, జట్టు సభ్యులు, అభిమానులు అండగా నిలిచారు. ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఓటమి విజయానికి దారులు చూపుతుంది. కష్టపడితే సాధ్యం కానిది అంటూ ఏది లేదు. నేను ఇష్టపడే ఈ క్రీడకు ప్రతిదీ అంకితం చేశాను. జాతీయ జట్టుతో 20 సంవత్సరాల అనుబంధానికి వీడ్కోలు పలికే సమయం వచ్చింది' అని లిన్ డాన్ ట్వీట్ చేశారు. ప్రపంచంలో కరోనా వల్ల క్రీడలను వాయిదా వేయడంతో ఆ కలని అసంభవం చేసిందని లిన్ డాన్ చెప్పారు.'' లిన్ డాన్‌ బ్యాడ్మింటన్‌ ప్రపంచంలో మొత్తం తొమ్మిది ప్రధాన టైటిల్స్ గెలుచుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు కావడం కావడం విశేషం.

Tags:    

Similar News