Vaibhav Suryavanshi: 10 సిక్స్‌లు, 13 ఫోర్లు..మెరుపు సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ!
Vaibhav Suryavanshi: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అదీ మామూలు చరిత్ర కాదు, ఒకేసారి రెండు ప్రపంచ రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు.
Vaibhav Suryavanshi: 10 సిక్స్‌లు, 13 ఫోర్లు..మెరుపు సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ!
Vaibhav Suryavanshi: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అదీ మామూలు చరిత్ర కాదు, ఒకేసారి రెండు ప్రపంచ రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు. వర్సెస్టర్‌షైర్‌లో జరిగిన ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత అండర్-19 జట్టు తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్, విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శించి అదరగొట్టాడు. మ్యాచ్ తొలి ఓవర్ నుంచే వైభవ్ దూకుడుగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఎలాంటి కనికరం లేకుండా చీల్చి చెండాడాడు. ఫలితంగా, కేవలం 52 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీని సాధించాడు. దీనితో యూత్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించిన ప్రపంచ రికార్డు వైభవ్ సూర్యవంశీ సొంతమైంది.
ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ గులాం పేరిట ఉండేది. అతను 2013లో ఇంగ్లాండ్‌పై 53 బంతుల్లోనే సెంచరీ సాధించి ఈ రికార్డును నెలకొల్పాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లోనే శతకం పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వేగవంతమైన సెంచరీతో పాటు, వైభవ్ సూర్యవంశీ మరో ప్రపంచ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. యూత్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సెంచరీ సాధించిన అత్యంత పిన్నవయస్కుడైన బ్యాటర్ గా కూడా వైభవ్ నిలిచాడు.
ఈ రికార్డు ఇంతకుముందు బంగ్లాదేశ్ జట్టుకు చెందిన నజ్ముల్ హొస్సేన్ షాంటో పేరిట ఉండేది. అతను 2013లో శ్రీలంకపై సెంచరీ సాధించినప్పుడు అతని వయసు 14 సంవత్సరాల 241 రోజులు మాత్రమే. కానీ ఇప్పుడు, వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల 100 రోజుల వయసులోనే సెంచరీ సాధించి ఈ రికార్డును బద్దలు కొట్టాడు. దీనితో యూత్ వన్ డే క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ, అత్యంత పిన్నవయస్కుడైన సెంచరీ వీరుడు అనే రెండు ప్రపంచ రికార్డులను వైభవ్ సూర్యవంశీ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మొత్తం 78 బంతులు ఎదుర్కొని, 10 భారీ సిక్స్‌లు, 13 ఫోర్ల సహాయంతో 143 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని మెరుపు సెంచరీ సాయంతో భారత్ అండర్-19 జట్టు 50 ఓవర్లలో 363 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లాండ్ అండర్-19 జట్టు 308 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో టీమిండియా-U19 జట్టు 55 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.