ఎత్తైన పర్వతం మీద దర్శనం ఇస్తున్న మానస దేవి

Update: 2020-08-12 05:56 GMT
మానసాదేవి ఆలయం

History of Manasa devi Temple : భారత దేశంలోని ఎప్పుడైనా ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చే ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్. ఈ క్షేత్రం హిందువుల మొదటి పర్యాటక కేంద్రంగా ఎప్పుడూ నిలుస్తుంది. దేశంలో యాత్రికులు ఇష్టపడే ప్రముఖ ప్రదేశం కావడంతో హరిద్వార్ లో సాధారణంగా పర్యాటక ఆకర్షణలుగా ఆలయాలు, ఆశ్రమాలు నిలుస్తాయి. ముఖ్యంగా ఈ హరిద్వార్ లో ముఖ్యమైన దేవాలయాలలో మరో ఆలయం మానసదేవీ ఆలయం. ఈ ఆలయం భారత దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ నగరానికి దగ్గరలో గల హిందూ దేవాలయం. ఈ దేవాలయం హిమాలయాల దక్షిణ భాగంలో గల శివాలిక్ పర్వత శ్రేణిలోని "బిల్వ పర్వతం" శిఖరం పై ఉంది. ఈ దేవాలయం హరిద్వార్ లో పంచతీర్థాలుగా పిలువబడే తీర్థాలలో ఒకటిగా పిలువబడుతోంది.

ఈ దేవాలయంలో అధిష్టాన దేవత మానస శక్తి రూపాలలో ఒకటి. ఈ దేవత పరమశివుని మనసు నుండి జనించినదని అక్కడి భక్తుల నమ్మకం మానస నాగరాజు అయిన వాసుకి యొక్క సోదరిగా భావింపబడుతోంది. "మానస" అనగా ప్రియ భక్తుల కోర్కెలు నెరవేర్చిన దేవత అని అర్థం. ఈ దేవాలయం పరిసరంలో గల వృక్షం యొక్క కొమ్మలకు దారాలను కట్టి తమ కోర్కెలను నెరవేర్చమని భక్తులు ప్రార్థిస్తారు. వారి కోర్కెలు నెరవేరిన తర్వాత భక్తులు మరల సందర్శించి ఆ చెట్టు కొమ్మలకు మరలా దారాలను కడతారు. ఈ దేవతకు కొబ్బరికాయలు, పండ్లు, దండలు, సువాసన అగర్ బత్తీలతో పూజలు చేస్తారు.

ఈ మానస దేవి ఆలయం భక్తులు తమ కోరికలు నెరవేర్చుకొనుటకు కొలిచే "సిద్ధ పీఠం"గా పూజింపబడుతోంది. ఇది హరిద్వార్ లో గల మూడు శక్తి పీఠాలలో ఒకటిగా అలరాలుతుంది. ఇది కాక హరిద్వార్ లో గల ముఖ్యమైన శక్తి పీఠాలుగా అలరాలుతున్నవి మాయాదేవి దేవాలయం, చండీదేవి ఆలయం. ఈ దేవాలయం అంతర భాగంలో రెండు దేవతా విగ్రహాలున్నాయి. వాటిలో ఒకటి ఎనిమిది చేతులతో, రెండవతి మూడు తలలు, ఐదు చేతులతో ఉన్నాయి.

ఆలయ విశేషాలు

మానస దేవి దేవాలయం ప్రాచీన దేవాలయాలలో ఒకటిగా గుర్తింపబడింది. హరిద్వార్ వెళ్ళే యాత్రికులు తప్పనిసరిగా దర్శించే ఆలయం ఇది. ఇది అనేక శతాబ్దాల నుండి హరిద్వార్ లో పవిత్ర సంప్రదాయాలను పెంచే దేవాలయం. ఈ దేవాలయం నుండి గంగా నది, హరిద్వార్లు కనబడతాయి. ఈ దేవాలయానికి వెళ్ళుటకు పర్వతం పైకి మెట్ల మార్గం ఉంది. ఈ ఆలయానికి చేరుటకు "రోప్ వే" మార్గం కూడా ఉంది. ఈ రోప్ వే సేవలను "మానసా దేవి ఉదంఖతోల" అని పిలుస్తారు. ఈ రోప్ వే సమీపంలో గల చండీదేవి ఆలయానికి కూడా కలుపబడుతోంది. ఈ రోప్ వే యాత్రికులను క్రింది స్టేషను నుండి మానస దేవి దేవాలయానికి తీసుకొని వెళుతుంది. ఈ రోప్ వే యొక్క మొత్త పొడవు సుమారు 540 మీటర్లు, ఎత్తు 178 మీటర్లు ఉంటుంది. సాధారణ దినాలలో ఈ దేవాలయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు తెలువబడుతోంది.

పార్వతీ దేవి రూపాలైన "మానస", "చండీ"లు ఎల్లప్పుడూ కలసి ఉండేవారని ఇక్కడి ప్రజల విశ్వాసం. అందువలన మానస దేవాలయం నీల పర్వతానికి ఎదురుగా ఉన్న బిల్వ పర్వతం పై కొలువైనది. ఇదే విధంగా హర్యానాలోని పంచుకుల ప్రాంతంలో మాతా మానస దేవి మందిరం, చండీఘర్ సమీపంలోని చండీ దేవాలయం కూడా ఒకే ప్రాంతంలో ఉండటం విశేషం.

 




Tags:    

Similar News