Dasara 2020: అక్కడ అమ్మవారికి చేపల వేపుడు నివేదిస్తారు.. ఎక్కడంటే..

Dasara 2020: దసరా ఉత్సవాలను దేశంలో వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా వేడుకగా నిర్వహిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో దసరా పండుగ ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం.

Update: 2020-10-22 10:33 GMT

Dasara 2020 : మన ముఖ్యమైన పండుగలు అన్నీ దేశవ్యాప్తంగా ఒకేలా నిర్వహించుకుంటారు. అయితే, దసరా మాత్రం స్థానిక పద్ధతులను కలబోసి జరుపుకుంటారు. రావణున్ని రాముడు చంపినా రోజుగా కొందరు దసరాకి ప్రాధాన్యత ఇస్తారు. దుర్గమ్మ మహిశాసురుడ్ని సంహరించిన శుభ దినంగా మరి కొందరు అమ్మవారి పూజలు చేస్తారు. అశోకుడు బౌద్ధమతం స్వీకరించిన రోజుగా దసరాకు ప్రాముఖ్యత ఇస్తారు ఇంకొందరు. ఇక పాండవులు వనవాసం చేసిన సమయంలో అజ్ఞాత వాసం చేస్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను ఉంచి పూజ చేసిన రోజుగా చాలా మంది దసరా జరుపుకుంటారు. ఇలా ఎన్నిరకాలుగా దసరాను భావించినా దసరా పండుగ అంటే చెడు పై మంచి గెలిచిన రోజు అనేది అందరూ ముక్తకంఠంతో ఒప్పుకుంటారు. భిన్నత్వంలో ఏకత్వం అదే మన దేశ ఔన్నత్యం.దసరా పండుగ విషయంలో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. 

ఇక మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో దసరా పండుగ ఎలా జరుపుకుంటారో చూద్దాం..

కర్నాటకలో దసరా ప్రపంచ ప్రసిద్దిగా..

దసరా పండుగను కర్నాటకలో ఘనంగా నిర్వహిస్తారు. మైసూర్‌లోని చాముండేశ్వరి ఆలయంలో నవరాత్రి వేడుకలు 400 ఏళ్లుగా జరుగుతున్నాయి. అప్పట్లోఈ సంబరాలను ప్రారంభించిన వడియార్‌ రాజవంశీకులు ఇప్పటికీ పూజల్లో పాల్గొనడం విశేషం. దసరా నాడు బంగారు అంబారీపై అమ్మవారిని ఊరేగించే కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతుంది. ఇక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మైసూర్‌ మహారాజా ప్యాలెస్‌ను దసరా పండక్కి లక్ష విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. ఇది ప్రపంచ రికార్డు.

చేపలను నివేదిస్తూ..

ఓడిశాలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటారు. అన్ని చోట్లా పది రోజుల పాటు ఉత్సవాలు జరిగితే..ఓడిశాలో మాత్రం షోడశోపచార అనే పేరుతో 16 రోజుల పాటు దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక ఎక్కడా లేని విధంగా దసరా ఉత్సవాల ముగింపురోజు ఇక్కడ అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. పెరుగన్నం.. కేకులతో పాటు చేపల వేపుడు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి కొలుస్తారు.

గుజరాత్ లో..

గుజరాత్ లో దసరా ఉత్సవాలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఎక్కువగా మహిళలు ఈ దసరా ఉత్సవాల్లో సంబరాలు జరుపుతారు. ముఖ్యంగా ప్రతి ఊరిలోనూ గార్బా.. దండియా నృత్యాలతో హోరెత్తిస్తారు. 

మహారాష్ట్రలో..

ఊరిపోలిమేరలు దాటి వెళితే దసరాకు మంచి జరుగుతుందని మహారాష్ట్రలో నమ్ముతారు. దీంతో పండుగ రోజు ''సీమోల్లంఘన'' పేరుతో వూరి పొలిమేరలు దాటి వెళతారు. దసరా పూజలతో పాటు చాలా మంది ఈ సీమోల్లంఘన పాటిస్తారు.

వారికి దసరా అయిపోయాకా సందడి..

దసరాకి మనం ముందు నవరాత్రులు జరుపుకుంటాం. అయితే..హిమాచల్ ప్రదేశ్ లోని కులూ లో మాత్రం దసరా వెళ్ళాకా వేడుకలు ప్రారంభం అవుతాయి. మనం వినాయక చవితి జరిపినట్టు వాళ్ళు దసరా తరువాత ఏడురోజులు ఉత్సవాలు చేస్తారు. దసరా రోజు రామలక్ష్మణ సీతా దేవి విగ్రహాలతో రథయాత్ర జరుపుతారు. ఈ వేడుకల్లో విదేశాల నుంచి వచ్చిన అతిథులు కూడా పాల్గొని సంబరాలు చేసుకుంటారు. వీరంతా కూడా భక్తిగా రథాన్ని లాగుతారు. నిజానికి ఇది అంతర్జాతీయ దసరా పండుగలా నిర్వహిస్తారు.

ఇక మన దేశంలోనే కాకుండా నేపాల్‌, బంగ్లాదేశ్‌, అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, మారిషస్‌, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా దసరా వేడుకలు ఘనంగా జరుగుతాయి.  

Tags:    

Similar News