transparent TV: అదరగొట్టేస్తున్న ఎంఐ అద్దంలాంటి సరికొత్త టీవీ.. ధర ఎంతో తెలుసా..?

transparent TV: పూర్తి పారదర్శకంగా ఉండే సరికొత్త టీవీని షావోమీ విడుదల చేసింది.

Update: 2020-08-16 15:47 GMT
xiaomi world's first transparent tv

ఏమండీ..ఇది చూశారా.. అరె.. ఏంటిది అద్దమా.. టీవీ షేపులో చేశారా భలే ఉంది అనుకుంటున్నారా.. మీరు అనుకుంటున్నవి రెండూ కరెక్టే.. అది అద్దం లాంటి టీవీ. ఇంకా అర్థం కాలేదా.. సరికొత్త ఎడ్జ్-టు-ఎడ్జ్ ట్రాన్స్ పరెంట్ గ్లాస్ డిస్ ప్లే టీవీ ఇది. అదిరిపోయింది కదూ. ఇంతకీ దీని విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..


ఎంఐ గా మనకందరికీ సుపరిచితమైన షావోమి మొబైల్ ఫోన్ల రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంది. అదేవిధంగా టీవీల మార్కెట్లోనూ తనదైన మార్కుతో దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ కంపెనీ 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ టీవీలను ప్రదర్శించింది. దృశ్యాలు గాలిలో తేలిపోతున్న అనుభూతిని కలిగించేలా ఎడ్జ్-టు-ఎడ్జ్ ట్రాన్స్ పరెంట్ గ్లాస్ డిస్ ప్లేతో అద్భుతమైన ఎంఐ టీవీలను లాంచ్ చేసింది.


55 అంగుళాల సైజులో ఎంఐ టీవీ లగ్జరీ ట్రాన్సపరెంట్ ఎడిషన్ టీవీలను తీసుకొచ్చింది. వర్చువల్, రియల్‌ను విలీనం చేసి అపూర్వమైన అనుభవాన్ని అందించేలా ఈ టీవీలను డిజైన్ చేసింది. టీవీ మాత్రమే కాకుండా, దీన్ని ఆఫ్ చేసినపుడు ఆర్ట్ పీస్ గా కనిపించే ఎంఐ టీవీ లక్స్ ట్రాన్సపరెంట్ ఎడిషన్ గ్యాలరీలు, మ్యూజియంలు, షాపింగ్ మాల్స్ , థియేటర్లకు కూడా చక్కగా అమరిపోతుందని షావోమి ప్రకటించింది.

అవునూ మనం ఎల్ఈడి టీవీలకు వెనుక కనెక్షన్లన్నీ అమర్చి ఉంటాయి కదా.. దీన్లో అవేమీ కనబడటం లేదు. మరి టీవీ ఎలా పనిచేస్తుందనే అనుమానం వస్తోంది కదూ.. అక్కడికే వస్తున్నా..


బ్యాక్ ప్యానెల్‌తో వచ్చే సాంప్రదాయ టీవీల్లా కాకుండా, అన్ని ప్రాసెసింగ్ యూనిట్లను దాని బేస్ స్టాండ్‌లో పొందుపరచారు. అదే దీని ప్రత్యేకత. అందుకే ఈ టీవీని ఆఫ్ చేసినా బోర్డర్, బేస్, తప్ప మిగిలిన సెట్ పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తుంది. దీంతో ఈ తరహా టీవీలను భారీగా ఉత్పత్తి చేసిన ప్రపంచంలోనే తొలి సంస్థగా షావోమి ఖ్యాతిని దక్కించుకుంది.


ఆగస్టు 16 న చైనాలో ఈ టీవీల అమ్మకాలు ప్రారంభించారు. మరి దీన్ని ఒకటి కొనేసుకుంటే అదిరిపోతుంది అనిపిస్తోందా.. ఆగండి దానికి ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతం చైనా మార్కెట్ లోనే వీటిని విక్రయిస్తున్నారు. మరి మిగిలిన దేశాల్లో ఎప్పటినుంచి వీటి అమ్మకాలు ప్రారంభిస్తారో కంపెనీ చెప్పలేదు. అయినా దీని ధర ఎంతో తెలుసా.. జస్ట్ 7 వేల డాలర్లు. అంటే సుమారుగా 5,23,982 రూపాయలు. అదీ విషయం ప్రస్తుతం వీటి ఫోటోలు మాత్రం చూసి ఆనందించడమే!

Full View


Tags:    

Similar News