Viral Video : 55 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ పహిల్వాన్..జిమ్ లేదు, సప్లిమెంట్లు లేవు.. అంతా దేశీ కండలే

55 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ పహిల్వాన్..జిమ్ లేదు, సప్లిమెంట్లు లేవు.. అంతా దేశీ కండలే

Update: 2026-02-26 02:37 GMT

Viral Video : హర్యానా అంటేనే మట్టిలో పుట్టిన మనుషులు, గట్టి పిండాలు ఉన్న కుస్తీ వీరుల అడ్డా. ఈ నేల నుంచి వచ్చే క్రీడాకారుల్లో ఏదో తెలియని పట్టుదల, పౌరుషం కనిపిస్తాయి. దీనికి నిదర్శనంగా నిలుస్తున్నారు సోనీపట్ జిల్లా జఠేడి గ్రామానికి చెందిన 55 ఏళ్ల సంజయ్. స్థానికులు ఆయనను ప్రేమగా తావు సంజయ్ లేదా కాలీ పహిల్వాన్ అని పిలుచుకుంటారు. ఈ వయసులో చాలామంది విశ్రాంతి కోరుకుంటే, మన తావు మాత్రం ఢిల్లీలో జరిగిన 42 కిలోమీటర్ల మారథాన్‌లో గోల్డ్ మెడల్ సాధించి, వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపించారు.

సంజయ్ సాధించిన ఈ విజయం వెనుక భారీ ఖర్చుతో కూడిన జిమ్‌లు, అధునాతన యంత్రాలు లేదా విదేశీ కోచ్‌ల ట్రైనింగ్ ఏమీ లేదు. ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ అంతా పక్కా దేశీ స్టైల్. తన ఇంట్లో ఉన్న సాధారణ వస్తువులతోనే రోజూ మూడు నాలుగు గంటల పాటు కఠినమైన కసరత్తులు చేస్తారు. ఇసుకపై పరుగు తీయడం, మైదానంలో సుదీర్ఘ దూరం పరిగెత్తడం, సంప్రదాయ వ్యాయామాల ద్వారా తన శరీరాన్ని ఇనుములా మార్చుకున్నారు. ఆయన సిక్స్ ప్యాక్ బాడీ చూస్తే పెద్ద పెద్ద బాడీ బిల్డర్లు కూడా షాక్ అవ్వాల్సిందే.

ఆయన ఆహారపు అలవాట్లు కూడా చాలా సింపుల్‌గా ఉంటాయి. ఎటువంటి ప్రోటీన్ పౌడర్లు, ఖరీదైన సప్లిమెంట్లు ఆయన జోలికి వెళ్లరు. కేవలం ఇంటి భోజనం.. అంటే పప్పు, రొట్టె, పాలు, ఆకుకూరలు మాత్రమే తింటారు. స్వచ్ఛమైన ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఉంటే శరీరం దానంతట అదే గట్టిపడుతుందని ఆయన నమ్మకం. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంజయ్ పరుగు తీస్తున్న వీడియోలు హర్యానా మారథాన్ రన్నర్ పేరుతో తెగ వైరల్ అవుతున్నాయి. 55 ఏళ్ల వయసులో ఆయన చూపిస్తున్న వేగం చూసి నేటి తరం యువత ముక్కున వేలేసుకుంటోంది.

నిజానికి సంజయ్ జీవితం మొదటి నుంచీ పూలబాట కాదు. చిన్నతనంలో పహిల్వాన్ కావాలని కలలు కన్నా, పేదరికం కారణంగా ఆ బాధ్యతలు ఆయనను వెనక్కి లాగాయి. కుటుంబం కోసం తన కలలను పక్కన పెట్టారు. తన కొడుకును అఖారా (కుస్తీ పోటీలు జరిగే చోటు)కు తీసుకెళ్తున్న సమయంలో, మళ్ళీ ఆయనలో నిద్రాణంగా ఉన్న క్రీడాకారుడు మేల్కొన్నాడు. అప్పటి నుంచి రోజువారీ సాధన మొదలుపెట్టారు. 42 కిలోమీటర్ల పరుగులో గోల్డ్ మెడల్ సాధించిన సంజయ్, ఇప్పుడు ఏకంగా 100 కిలోమీటర్ల పందెంలో గెలవడమే తన తదుపరి లక్ష్యమని చెబుతున్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తున్న ఈ దేశీ బాడీబిల్డర్ నేటి యువతకు నిజమైన స్ఫూర్తిప్రదాత.

Tags:    

Similar News