ముందు పిల్లలు.. ఆ తర్వాతే పెళ్లి.. ఇంతకీ ఇది ఎక్కడో తెలుసా..?
ఇద్దరు వ్యక్తులు పెళ్లి తర్వాతే ఒక్కటి కావాలి. పిల్లల్ని కనాలి. లేదంటే ఆడవారిపై లేనిపోని అభాండాలు వేస్తారు. కానీ ఇక్కడ మాత్రం స్త్రీలు తమకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేయొచ్చు. పిల్లల్ని కనొచ్చు.
ముందు పిల్లలు.. ఆ తర్వాతే పెళ్లి.. ఇంతకీ ఇది ఎక్కడో తెలుసా..?
డేటింగ్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఇద్దరు వ్యక్తులు కలిసి కొంత కాలం డేటింగ్ చేసిన తర్వాత అభిప్రాయాలు నచ్చితే పెళ్లి చేసుకుంటున్నారు. నచ్చకపోతే విడిపోతున్నారు. కానీ ఇది సెలబ్రిటీలు, ఉన్నత కుటుంబాల్లో మాత్రమే. సాధారణ కుటుంబాల్లో దీన్ని అంగీకరించరు. ఇద్దరు వ్యక్తులు పెళ్లి తర్వాతే ఒక్కటి కావాలి. పిల్లల్ని కనాలి. లేదంటే ఆడవారిపై లేనిపోని అభాండాలు వేస్తారు. కానీ ఇక్కడ మాత్రం స్త్రీలు తమకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేయొచ్చు. పిల్లల్ని కనొచ్చు. ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవచ్చు. నచ్చకపోతే అతడితో విడిపోవచ్చు. ఇదంతా అక్కడ కామన్.. ఇంతకీ అదెక్కడో కాదు. మన ఇండియాలోనే.
పెళ్లి తర్వాతే కలిసి కాపురం చేయాలనేది మన సంప్రదాయం. ఈ క్రమంలో పొరపాటున పెళ్లికి ముందే గర్భం దాల్చినా, పిల్లల్ని కన్నా.. మగవారి కంటే ముందు ఆడవారినే తప్పు పడుతుంది మన సమాజం. గరాసియా తెగ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. పెళ్లికి ముందే నచ్చిన వ్యక్తితో సహజీవనం చేసి పిల్లల్ని కనే సంప్రదాయం ఈ తెగలో అతి సాధారణ విషయం. దీని గురించి ప్రశ్నించే హక్కు, అధికారం ఎవ్వరికీ ఉండదంటే అతిశయోక్తి కాదు.
రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఈ తెగ విస్తరించి ఉంది. వీళ్ల సంప్రదాయం ప్రకారం.. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకోవడానికి రెండు రోజుల పాటు ఓ జాతర జరుగుతుంటుంది. ఇందులో భాగంగా తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకుని అతనితో సహజీవనం చేయొచ్చు. ఈ క్రమంలో అబ్బాయిల కుటుంబ సభ్యులు కొంత సొమ్మును అమ్మాయి కుటుంబానికి అందించి.. వారితో సహజీవన ప్రారంభింపజేస్తారు. ఇది ఒక రకంగా ఎదురుకట్నం అన్నమాట. ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఈ జంట వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటే.. ఆ సమయంలోనూ పెళ్లి ఖర్చులన్నీ వరుడి కుటుంబ సభ్యులే భరిస్తారు. వరుడి ఇంట్లోనే ఘనంగా పెళ్లి నిర్వహించే ఆచారం ఇక్కడ దశాబ్దాలుగా కొనసాగుతోంది.
ఈ తెగలో ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి ఏళ్ల తరబడి సహజీవనం చేసే ఆచారం ఉంది. ఈ క్రమంలో పిల్లల్ని కనొచ్చు. ఆ తర్వాత ఆర్థికంగా స్థిరపడిన తర్వాత అంటే ఏ లోటు లేకుండా కుటుంబాన్ని పోషించగలమన్న ధీమా ఏర్పడ్డాకే పెళ్లి చేసుకోవచ్చు. ఈ పద్ధతిని ఇక్కడి ప్రజలు దాపాగా పిలుస్తుంటారు. అంటే ఇక్కడ పెళ్లిని అత్యవసరంగా కాకుండా నామమాత్రంగా పరిగణిస్తారన్న మాట. ఇక్కడ సుదీర్ఘ కాలంగా సహజీవనం చేస్తోన్న వృద్ధ తల్లిదండ్రులకు తమ పిల్లలే పెళ్లి చేసిన సందర్భాలు ఉన్నాయి.
అంతేకాదు సహజీవనంలో ఉన్న భాగస్వామి తనను వేధించినా.. ఇకపై తనతో కొనసాగలేమని నిర్ణయించుకున్నా.. ఈ బంధం నుంచి బయటకు వచ్చే వెసులుబాటును ఇక్కడి మహిళలకు కల్పించారు గరాసియా తెగ పెద్దలు. గరాసియా తెగ పాటిస్తోన్న ఈ ఆచారాలన్నీ ఈ నాటివి కావు. కొన్ని శతాబ్దాలకు పూర్వమే అక్కడి ప్రజలు ఈ సంప్రదాయాలను పాటిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు వాటినే ఈ తరం వారు కొనసాగిస్తున్నారని అంటున్నారు. ఈ ఆచారాలే కాలక్రమేణా వరకట్న వేధింపులు, మరణాలు, అమ్మాయిలపై అత్యాచారాలు వంటి వాటిని తగ్గించాయని అక్కడి ప్రజలు చెప్పడం గమనార్హం. ఇవన్నీ వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజమంటున్నారు.
మొత్తానికి పెళ్లి విషయంలో ఇక్కడి స్త్రీలపై లేనిపోని ఆంక్షలు విధించకుండా.. పూర్తి స్వేచ్ఛ కల్పిస్తూ వారి నిర్ణయాలను ఇక్కడి తెగ ప్రజలు గౌరవిస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది.