12న కాకినాడలో నిరాహార దీక్ష చేస్తా: పవన్‌

Update: 2019-12-08 11:46 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరాహార దీక్షకు దిగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని లేకపోతే.. ఈ నెల 12న కాకినాడలో నిరాహార దీక్ష చేస్తానని అల్టిమేటం జారీ చేశారు. రాజమండ్రి రైతు సదస్సులో పాల్గొన్న పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో 100 మంది రైతుల్లో 60శాతం కౌలు రైతులే ఉన్నారని.. కొందరు రైతులు పండించిన ధాన్యం విక్రయించి 45 రోజులు గడుస్తున్నా.. వారికి డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. వ్యవసాయ మార్కెట్లో ధాన్యం నిల్వచేసిన రైతులకు రసీదులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించకుంటే ఖచ్చితంగా ధర్నాకు దిగుతానని స్పష్టం చేశారు.

రైతులకు గిట్టుబాటు ధర లేక కన్నీళ్లు పెడుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఏసీ గదుల్లో తింటున్నారని విమర్శించారు. ఒక కులానికి రైతు భరోసా వర్తించదని చెప్పడం దుర్మార్గమని పవన్ ధ్వజమెత్తారు. ముద్దులు పెట్టి ఆలింగనం చేసుకుంటే రైతుల కడుపులు నిండుతాయి అని ప్రశ్నించారు. 150 మంది ఎమ్మెల్యేలు రైతు రక్తంతో తడిసిన మద్దను తింటున్నారని అన్నారు. ఓట్ల కొనుగోలు కోసం డబ్బులు ఇస్తారు కానీ రైతుల కష్టాలను పంచుకునేవారు లేరని విమర్శించారు. పాదయాత్రలో రైతులను ఆదుకుంటామన్న జగన్.. ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. 

Similar News