Sankranti Traditions: డూ డూ బసవన్న... సంక్రాంతి సందడిలో కనుమరుగవుతున్న గంగిరెద్దుల కళ

Sankranti Traditions: సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దుల సందడి తప్పనిసరి. ఇంటింటికి తిరుగుతూ ఆశీర్వాదాలు ఇచ్చే డూ డూ బసవన్నలు నేటి కాలంలో ఆదరణ కోల్పోతున్నారు.

Update: 2026-01-12 06:31 GMT

Sankranti Traditions: డూ డూ బసవన్న... సంక్రాంతి సందడిలో కనుమరుగవుతున్న గంగిరెద్దుల కళ

Sankranti Traditions: సంక్రాంతి వేళ పల్లెలతో పాటు పట్టణాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ముచ్చటగా మూన్నాళ్లు చేసే పండుగకు బసవయ్యలతో గంగిరెద్దుల వారు సిద్దమయ్యారు. పీపీ ఊదుతూ గంగిరెద్దును పట్టుకుని ఇంటింటికి వెళ్లి ఇచ్చింది తీసుకెళ్తుంటారు. బసవయ్యలను దైవంగా భావిస్తూ తమ కులవృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.


ప్రపంచంలో అలనాటి కళలను పాలకులు, ప్రజలు ఆదరిస్తున్నారు.. కాని భారతీయ కళలు మాత్రం రాను రాను కనుమరగవుతున్నాయి... కనీసం వీరికి జీవన భృతి లేకపోవడంతో ఆ కళలు మసకబారుతున్నాయి. భావితరాల వారి కోసం మన కళలను బతించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నది సత్యం... అలనాటి కళలలో గంగిరెద్దుల ఆట పిల్లల నుండి పెద్దల వరకూ ఆదరిస్తారు. గంగిరెద్దుల వారు ప్రతీ ఏటా సంక్రాంతి రోజున మాత్రమే కనపడుతుంటారు. చలి వెచ్చటి భోగి మంటలతో వచ్చే పండుగ సంక్రాంతి. అటువంటి సంక్రాంతి వస్తుందంటే చాలు డూడూ బసవన్నల సందడి ప్రారంభమవుతుంది. గంగిరెద్దులాట మన సంస్కృతిలో ఓ భాగం. సంక్రాంతి వచ్చిందంటే చాలు.. గంగిరెద్దులాటలతో పల్లెలన్నీ సందడిగా మారుతాయి. గంగిరెద్దుల వాళ్లు ఎద్దులతో చేయించే విన్యాసాలు అబ్బురపరుస్తాయి. కొందరు పెద్దల జ్ఞాపకార్థం లేగ దూడలను గంగిరెద్దులవాళ్లకు దానం చేస్తారు. వాటికి శిక్షణ ఇచ్చి ఆటలాడిస్తారు.


ధనుర్మాసం రాగానే వీరంతా గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంటారు... ఒక్కొక్క ఊరుని వారు పంచుకుంటారు... ఆ గ్రామం లేదా పట్టణ శివారు ల్లో గుడారాలు వేసుకొని అక్కడే వంట చేసుకుంటారు.. తమతో తెచ్చిన ఎద్దులను కూడా అక్కడే కట్టుకొని అక్కడ ఉన్న పచ్చగడ్డి లేదా ఎండు గడ్డిని వాటికి ఆహారంగా వేస్తారు.. వీరంతా సమిష్టిగానే వంటలు చేసుకొని తెల్లవారుఝామునే స్నానాలు చేసుకొని ఎద్దులను అలంకరిస్తారు. వీరూ అలంకరణతో బయలు దేరుతారు. శ్రీకాకుళం జిల్లాలో 500 గంగిరెద్దుల కుటుంబాలు ఉన్నాయి... ఆమదాలవలస నియోజకవర్గం, నరసన్నపేట నరసన్నపేట నియోజకవర్గం, శ్రీకాకుళం రూరల్, సారవకోట మండలాల్లో వీరు ఉంటున్నారు.


డోలు,సన్నాయి వాయిద్యాల మధ్య గంగిరెద్దుల వాళ్ళు బసవన్నలను తీసుకుని ఇళ్ల ముందుకు వస్తుంటారు. అయ్యగారికి దన్నం పెట్టూ...అమ్మవారికి దన్నం పెట్టూ అంటూ బసవన్నల చేత విన్యాసాలు చేయిస్తుంటారు. సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా వారు కుల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఎక్కడికక్కడ గూడారాలు వేసుకుని దాని పరిసర ప్రాంతాల్లో గంగిరెడ్లను ముస్తాబు చేసి వీధులలో తిప్పులు వచ్చే అరకొర ఆదాయమే వారికి దిక్కు. అందరూ పండగ చేసుకుంటున్న తరుణంలో వీరు మాత్రం రోడ్ల వెంబడి తిరిగి భిక్షాటన చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. అక్కడి చుట్టు పక్కల ప్రాంతాల్లో మగవారు బసవన్నలను తీసుకుని గ్రామాలలోకి వెళితే... ఆడవారు పూసల అమ్మకాలకు వెళ్తుంటారు.

ఒక బృందంలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ప్రధాన వ్యక్తి గంగిరెద్దును ఆడిస్తుంటే, మిగతా వారు డోలు, సన్నాయి వాయిస్తుంటారు. మేళతాళాలకు అనుగుణంగా గంగిరెద్దును ఆడిస్తుంటారు. వీరంతా ఒక్కో గ్రామంలో మకాం వేస్తూ, గ్రామ పెద్దల అనుమతితో ఊరి మధ్యలోగానీ, చౌరస్తా లాంటి ప్రదేశంలోగానీ గంగిరెద్దుల ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ ధనుర్మాసంలో తప్ప వేరొక మాసంలో వీరికి తిండికి కూడా ఇబ్బందులే.. దొరికితే కూలి పని లేదంటే పస్తులే.. తమ పిల్లలు కూడా ఈ వృత్తిలోకి రావడానికి ససేమిరా అంటున్నారని వారు వాపోయారు. తెల్లవారుఝామునే చలిలో 4 గంటలకే వీరు లేచి స్నానాదులు కానిచ్చి అనంతరం గిత్తలను అలంకరణ చేస్తారు... స్నానం చేయకుండా ఈ గిత్తల వద్దకు వెళ్లరు. అలంకరణ ముందు సూర్యనమస్కారం చేసి వాటి నుదిట నరసింహస్వామి విగ్రహం పెట్టి అలంకరణ చేస్తారు.


 గంగిరెద్దుల అలంకరణ ఆకట్టుకునేలా ఉంటుంది. ఉన్నంతలో అందంగా తీర్చిదిద్దుతారు. బట్టలను బొంతలుగా కుట్టి, వాటికి అద్దాలు పొదుగుతారు. మరింత ఆకర్షణ కోసం చెమ్కీ దండలు జతచేసి, మూపురం నుంచి తోక వరకూ కప్పుతారు. ముఖం దగ్గర రంగుల తోలు కుచ్చు, మూతికి తోలుతో కుట్టిన శిఖమారు కడుతారు. కాళ్లకు గజ్జెలు, మెడలో గంటలు కట్టి బసవన్నను అలంకరిస్తారు. వాటిని ఆడించే కళాకారులూ ప్రత్యేకంగా ముస్తాబవుతారు. నెత్తికి రంగుల తలగుడ్డ, మూతిమీద కోరమీసాలు, చెవులకు కమ్మల జోడు, పాత కోటు, చేతికి వెండి మురుగులు, పంచె ధరించి ఆకర్షణీయంగా కనిపిస్తా రు. సన్నాయి బూర, డోలు, చేతిలో చిన్న కంచు గంట పట్టుకొని ప్రదర్శన నిర్వహిస్తారు. ఆటతోపాటు గాత్రంతోనూ వినోదాన్ని పంచుతారు. సన్యాసమ్మ, రాములోరు, గంగరాజు, ఈశ్వరమ్మ, వీరగున్నమ్మ పాటల్లాంటివి పాడతారు. కాని నేడు అవి కనుమనుగురు అవుతున్నాయి... ఇంటింటికి వెళితే 5 లేక 10 రూపాయలు, కొంత బియ్యం ఇస్తున్నారు.


గంగిరెద్దులవాళ్లు ఎద్దులను కుటుంబ సభ్యులుగా భావిస్తారు. గంగిరెద్దు చనిపోతే, మనిషికి చేసినట్టే అంత్యక్రియలు చేస్తారు. దినకర్మలూ నిర్వహిస్తారు. శతాబ్దాల చరిత్ర కలిగిన గంగిరెద్దులాట, నేడు కనుమరుగయ్యే స్థితికి చేరుకొన్నది. ఈ కళను నమ్ముకొని తరాలుగా జీవనం సాగించిన వేలాది కుటుంబాలు, ప్రస్తుతం ఆదరణలేక ఇతర వృత్తులను ఆశ్రయిస్తున్నాయని వారు వాపోతున్నారు.

ధనుర్మాసం రాగానే ఇంటింటికీ తిరుగుతూ గంగిరెద్దులను ఆడిస్తారు. తమ ఇంటికొచ్చిన గంగిరెద్దును సాక్షాత్తు నందీశ్వరుడి స్వరూపంగా భావించి ఇంటివాళ్లు హారతి పట్టి పూజిస్తారు.‘డూ డూ బసవన్న.. రా రా బసవన్నా..’ అనగానే ఎద్దులు ముందుకు వస్తాయి. ‘అమ్మవారికి దండంబెట్టూ.. అయ్యగారికి దండంబెట్టు’ అనగానే, ముందరి కాలెత్తి సలాం చేస్తాయి. ‘అయ్యగారికి శుభం కలుగుతుందా! తలపెట్టబోయే కార్యం సఫలమవుతుందా!’అనగానే గంగిరెద్దులు తలాడించడాన్ని శుభ సూచకంగా, నందీశ్వరుడి దీవెనగా భావిస్తారు. గంగిరెద్దువాళ్లు కూడా ఎద్దు ముందుకాళ్లను ఛాతీమీద పెట్టుకొని ఆడిస్తారు. ఇంటిల్లిపాదినీ తమదైన శైలిలో పొగుడుతూ, ఆశీర్వచనాలు ఇస్తారు.


Tags:    

Similar News