Viral: మృత్యువు ఒడిలో నిద్రపోవడమంటే ఇదే..8 అడుగుల కొండచిలువతో బెడ్ షేర్ చేసుకున్న మహిళ

Viral: గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ ఒంటిపై ఏదో బరువైన వస్తువు పాకుతున్నట్లు అనిపిస్తే ఏమనుకుంటారు? బహుశా ఇంట్లో పెంచుకునే కుక్కో లేదా పిల్లో వచ్చి మీద పడిందని సరిపెట్టుకుంటారు.

Update: 2026-01-18 06:57 GMT

Viral: గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ ఒంటిపై ఏదో బరువైన వస్తువు పాకుతున్నట్లు అనిపిస్తే ఏమనుకుంటారు? బహుశా ఇంట్లో పెంచుకునే కుక్కో లేదా పిల్లో వచ్చి మీద పడిందని సరిపెట్టుకుంటారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళకు కూడా సరిగ్గా ఇలాగే అనిపించింది. కానీ కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఉన్నది పెంపుడు జంతువు కాదు.. ఏకంగా ఎనిమిది అడుగుల భారీ కొండచిలువ. ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుట్టించే ఈ భయంకర సంఘటన బ్రిస్బేన్‌లో వెలుగుచూసింది.

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో నివసించే రేచల్ బ్లూర్ అనే మహిళకు ఆ రాత్రి ఎప్పటికీ మర్చిపోలేని ఒక పీడకలలా మిగిలిపోయింది. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న ఆమెకు తన పొట్ట, ఛాతీ భాగంపై ఏదో బరువుగా అనిపించింది. తన పెంపుడు కుక్క వచ్చి మీద పడుకుందేమో అని భావించిన ఆమె, నిద్రలోనే దానిపై చేయి వేసి నిమిరింది. అయితే తన చేతికి తగిలింది కుక్క వెంట్రుకలు కాదు.. చల్లగా, గరుకుగా ఉన్న పాము చర్మంజ. వెంటనే మెలకువ వచ్చి చూసేసరికి, ఒక భారీ కార్పెట్ పైథాన్ ఆమెపై కుండలీకృతమై కూర్చుని ఉంది. ఆ దృశ్యం చూసి ఆమె నోట మాట రాలేదు.

పక్కనే ఉన్న ఆమె భర్త కూడా ఆ భారీ పామును చూసి హతాశుడయ్యాడు. భయంతో కేకలు వేయకుండా.. "బేబీ, అస్సలు కదలొద్దు.. నీ మీద సుమారు 8 అడుగుల పాము ఉంది" అని మెల్లగా హెచ్చరించాడు. ఆ పాము ఎంత పెద్దదంటే, దాని సగం శరీరం రేచల్ మీద ఉంటే.. తోక భాగం ఇంకా కిటికీ బయటే ఉంది. అంటే కిటికీ ద్వారా అది లోపలికి ప్రవేశించి నేరుగా ఆమె మంచంపైకి చేరిందన్నమాట. ఏ మాత్రం కదిలినా ఆ పాము కాటేస్తుందేమో లేదా చుట్టేస్తుందేమో అన్న భయంతో ఆమె ఊపిరి బిగబట్టి అలాగే ఉండిపోయింది.

తన ఇంట్లో ఉన్న డాల్మేషియన్ కుక్కకు ఈ విషయం తెలిస్తే అది పాముపైకి దాడికి వెళ్తుందని, అప్పుడు పరిస్థితి ఇంకా ఘోరంగా మారుతుందని రేచల్ గ్రహించింది. అందుకే మొదట తన పెంపుడు జంతువులను వేరే గదిలోకి పంపేలా చేసింది. ఆ తర్వాత భర్త సలహా మేరకు, పామును ఏమాత్రం రెచ్చగొట్టకుండా దుప్పటి కింద నుంచి మెల్లగా జారి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత అతి కష్టం మీద ఆ భారీ కొండచిలువను గది నుంచి బయటకు పంపి ప్రాణాలు దక్కించుకున్నారు. "అది నిజంగా జరుగుతుందా లేదా అని నా మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది.. అది చాలా వింతగా, భయంకరంగా ఉంది" అని రేచల్ తన అనుభవాన్ని పంచుకుంది.

Tags:    

Similar News