Sick Leave: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి... లైవ్ లొకేషన్ పంపాలన్న బాస్!
Sick Leave: తలనొప్పిగా ఉందని సెలవు అడిగిన ఉద్యోగికి చుక్కలు చూపించిన బాస్! అనారోగ్యానికి నిరూపణగా లైవ్ లొకేషన్ పంపాలని హుకుం జారీ చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
Sick Leave: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి... లైవ్ లొకేషన్ పంపాలన్న బాస్!
Sick Leave: తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నానని చెబుతూ సిక్ లీవ్ కోరిన ఓ ఉద్యోగికి, అతని బాస్ నుంచి ఎదురైన అనుభవం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అనారోగ్య కారణాలతో సెలవు అడగడం ఉద్యోగి హక్కు కాగా, అందుకు రుజువుగా లైవ్ లొకేషన్ షేర్ చేయాలని ఆదేశించడం తీవ్ర విమర్శలకు గురవుతోంది.
వివరాల్లోకి వెళితే, సదరు ఉద్యోగి వాట్సాప్‌లో తన బాస్‌కు “తీవ్రమైన తలనొప్పి ఉంది, ఈ రోజు సెలవు కావాలి” అని మెసేజ్ చేశాడు. తొలుత హెచ్‌ఆర్‌తో మాట్లాడాలని చెప్పిన బాస్, అనంతరం హెచ్‌ఆర్ విభాగం “వాలిడ్ డాక్యుమెంట్స్” కోరుతోందని, వెంటనే లైవ్ లొకేషన్ షేర్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ సంభాషణకు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్‌ను ఆ ఉద్యోగి రెడ్డిట్‌లో పోస్ట్ చేస్తూ, “ఇది సరైంది కాదని నాకు తెలుసు. దీని వల్ల నాకు ఏమైనా సమస్యలు వస్తాయా?” అని నెటిజన్లను సలహా కోరాడు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
దీనిపై స్పందించిన నెటిజన్లు బాస్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ఉద్యోగి ప్రైవసీని ఘోరంగా ఉల్లంఘించడమేనని, లైవ్ లొకేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని సూచించారు. “తలనొప్పికి వాలిడ్ డాక్యుమెంట్ ఏంటి?”, “ఇది ఉద్యోగం… బానిసత్వం కాదు” అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి.
మరికొందరు ఇది భారతీయ కార్యాలయాల్లో పెరుగుతున్న టాక్సిక్ మైక్రో మేనేజ్‌మెంట్‌కు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల వ్యక్తిగత గోప్యతకు గౌరవం ఇవ్వకపోవడమే వర్క్ కల్చర్ దిగజారడానికి కారణమవుతోందని పేర్కొన్నారు.
ఈ ఘటన ఉద్యోగుల హక్కులు, ప్రైవసీ పరిరక్షణ, కంపెనీల బాధ్యతలపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తిస్తోంది.