పతనావస్థలో కర్ణాటక సర్కారు.. రాజీనామా యోచనలో కుమారస్వామి?

Update: 2019-07-11 03:57 GMT

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. రెబల్ ఎమ్మెల్యే రాజీనామాలు వెనక్కి తీసుకోవడానికి ససేమిరా అనడం, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, అసమ్మతి నేతలు సుప్రీంకోర్టు మెట్లెక్కడంతో సీఎం కుమారస్వామి ముందున్న అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక రాజీనామా తప్ప మరో మార్గం లేదని భావిస్తున్న కుమారస్వామి దానికే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలకు ముందే ఆయన రాజీనామా చేయవచ్చని భావిస్తున్నారు.

ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మంత్రి డీకే శివకుమార్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీనికితోడు కాంగ్రెస్‌ హొసకోటే ఎమ్మెల్యే, మంత్రి ఎంటీబీ నాగరాజు, చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే కె.సుధాకర్‌లు బుధవారం రాజీనామా చేయడంతో కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు పతనం అంచుకు చేరుకుంది. వరస పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కుమారస్వామి బుధవారం రాత్రి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా తన రాజీనామాపై చర్చించినట్టు తెలుస్తోంది. శాసనసభ సమావేశాలు ప్రారంభమవడానికి ముందే ఆయన తన రాజీనామా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 

Tags:    

Similar News