Uttarakhand Train Accident: ఉత్తరాఖండ్‌లో లోకో రైళ్ల ఢీ.. చమోలీలో ఘోర ప్రమాదం.. 70 మందికి గాయాలు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో మంగళవారం రాత్రి తీవ్ర రైలు ప్రమాదం చోటుచేసుకుంది
Uttarakhand Train Accident
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో మంగళవారం రాత్రి తీవ్ర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విష్ణుగఢ్–పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన సొరంగంలో రెండు లోకో రైళ్లు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 70 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని తక్షణమే చమోలీలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
చమోలీ జిల్లా కలెక్టర్ గౌరవ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో విధుల్లో ఉన్న కార్మికులు షిఫ్ట్ మారే వేళ ఈ ప్రమాదం జరిగింది. సొరంగం లోపలికి కార్మికులు, అధికారులను తీసుకెళ్తున్న లోకో ట్రైన్.. అదే సమయంలో పరికరాలు తరలిస్తున్న మరో లోకో ట్రైన్‌ను ఢీకొట్టిందని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో రైలులో మొత్తం 109 మంది ఉన్నారని, వారిలో 70 మందికి గాయాలైనట్లు నిర్ధారించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులేనని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సూర్జిత్ సింగ్ మాట్లాడుతూ.. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలతో సొరంగానికి చేరుకుని, లోపల ఉన్న కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని, ప్రాణాపాయం తప్పిందన్నారు.
ఇక ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన సమయంలో భద్రతా చర్యలు, సిగ్నలింగ్ వ్యవస్థలో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.