ఆ రెండు జోన్‌లలో సెలూన్స్, పార్లర్స్‌కి అనుమతి
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ లో ప్రజలు మరింత ఇబ్బందులు చెందకుండా కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. దేశాన్ని ఆంధ్రప్రదేశ్ తరహాలో గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్‌లుగా విభజించి ఆంక్షలతో కూడిన సడలింపులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.. అయితే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, స్పోర్ట్స్, సినిమా థియేటర్లు, ఆధాత్మిక ప్రదేశాల్లో కార్యక్రమాలపై మాత్రం నిషేధం కొనసాగుతుందని చెప్పింది. అలాగే అంతర్రాష్ట్ర ప్రయాణాలపై, మెట్రో, విమాన, రైల్వే సర్వీసులపై నిషేధం, విద్యా సంస్థలు మూసివేత కొనసాగుతుంది. ఇదిలావుంటే తాజాగా, సెలూన్‌లు తెరవడానికి కేంద్ర హోం శాఖ అనుమతించింది. అయితే గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్న వాటికి మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేసింది.
మే 4 నుంచి మొదలయ్యే మూడో దశ లాక్‌డౌన్‌లో ఇచ్చిన కొన్ని సడలింపులపై శనివారం స్పష్టతనిచ్చింది. ఆ రెండు జోన్లలో ఈ-కామర్స్ సంస్థలు అవసరమైన వస్తువులను విక్రయించుకోవచ్చని సూచించింది. అయితే ఇతర నాన్ ఎసెన్షియల్ వస్తువులకు మాత్రం అనుమతి లేదని పేర్కొంది. కంటెయిన్‌మెంట్ ప్రాంతాలు మినహా అన్ని జోన్లలో మద్యం విక్రయాలను చేసుకోవచ్చని తెలిపింది. అయితే దీనికి కొన్ని షరతులను మాత్రం విధించింది. మద్యం కొనేవారికి తప్పనిసరిగా మాస్కు ఉండటం తోపాటు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి. ఇవన్నీ సోమవారం నుంచి అమల్లోకి వస్తాయి. కాగా మొత్తం 733 జిల్లాల్లో కరోనా వైరస్ పరిస్థితిని అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం.. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. అందులో 130 జిల్లాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి.