Aravalli Hills: ఆరావళి కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు .. సోమవారం కీలక విచారణ..!!

Aravalli Hills: ఆరావళి కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు .. సోమవారం కీలక విచారణ..!!

Update: 2025-12-28 01:07 GMT

Aravalli Hills Dispute: ఆరావళి పర్వత శ్రేణులకు సంబంధించిన వివాదం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. సోమవారం విచారణ చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ కేసును ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌తో పాటు జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ ఎ.జి. మసీహ్ ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. కేసుకు “ఆరావళి కొండలు, పర్వత శ్రేణుల నిర్వచనం, దానికి సంబంధించిన అంశాలు అనే పేరును నిర్ణయించారు.

ఆరావళి ప్రాంత పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆరావళి పరిధిలో కొత్త మైనింగ్ లీజులను పూర్తిగా నిలిపివేస్తూ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF&CC) అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఆరావళి ప్రాంతంలో కొత్తగా గనుల తవ్వకాలకు అనుమతులు ఉండవని కేంద్రం తేల్చిచెప్పింది

ఇప్పటికే మైనింగ్ నిషేధం అమలులో ఉన్న ప్రాంతాలతో పాటు, పర్యావరణం, భౌగోళిక స్వరూపం, ప్రకృతి దృశ్యాలను పరిగణనలోకి తీసుకొని మరికొన్ని సున్నితమైన ప్రాంతాలను గుర్తించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ బాధ్యతను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE)కు అప్పగించింది. శాస్త్రవేత్తల బృందం పూర్తి స్థాయి అధ్యయనం చేసి నివేదిక సమర్పించే వరకు, ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోమని స్పష్టం చేసింది.

ఇప్పటికే కొనసాగుతున్న గనుల విషయంలో కూడా కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా, పర్యావరణ రక్షణకు సంబంధించిన అన్ని నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టంగా చెప్పింది. పర్యావరణానికి హాని కలగకుండా, పరిమితులతో కూడిన నియంత్రణలోనే మైనింగ్ జరగాలని కేంద్రం ఆదేశించింది.

ఇటీవల కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా ఈ అంశంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఆరావళి పర్వతాలను కాపాడటం అంటే కేవలం కొండలను రక్షించడమే కాదని, అది తాగునీటి వనరులు, వాతావరణ సమతుల్యత, జీవ వైవిధ్యాన్ని కాపాడటంతో ముడిపడి ఉందని ఆయన అన్నారు. అక్రమ మైనింగ్‌ను పూర్తిగా అడ్డుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని, శాస్త్రీయ ప్రణాళిక సిద్ధమయ్యే వరకు కొత్త తవ్వకాలకు అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు.

ఆరావళి విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదని, కానీ రెండు ముఖ్యమైన చర్యలకు కోర్టు ఆమోదం లభించిందని మంత్రి తెలిపారు. ఒకటి గ్రీన్ ఆరావళి ప్రాజెక్ట్ , రెండవది ఆరావళి ప్రాంతానికి సంబంధించిన పూర్తి మ్యాప్‌తో పాటు రక్షణ ప్రణాళికను శాస్త్రవేత్తలు సిద్ధం చేయడం. ఈ నివేదిక పూర్తయ్యే వరకు ఆరావళిలో మైనింగ్‌పై ఆంక్షలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టంగా చెప్పింది.

Tags:    

Similar News