మీకు చాత కాకపోతే.. మేం చూసుకుంటాం!

Update: 2019-07-11 07:09 GMT

అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం సమస్య పరిష్కారంలో మధ్యవర్తిత్వంతో ఎలాంటి ప్రయోజనం కన్పించట్లేదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో ఈ నెల 18లోపు మధ్యవర్తిత్వ కమిటీ అప్పటి వరకు ఉన్న సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆ నివేదికలో మధ్యవర్తిత్వ కమిటీ సామరస్య పరిష్కారం చూపించకపోతే జులై 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.

అయోధ్య వివాదంలో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడానికి అవకాశముంటే సూచించాలని ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్‌.ఎం.ఖలీఫుల్లా, ''ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌'' వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ వ్యవహారంలో మధ్యంతర నివేదికను కమిటీ ఇటీవల న్యాయస్థానానికి సమర్పించింది. అయితే సామరస్య, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు తమకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ కోర్టును కోరింది. దీంతో అయోధ్య పరిష్కారం కోసం కమిటీకి ఆగస్టు 15వరకు న్యాయస్థానం గడువు కల్పించింది.

అయితే మధ్యవర్తిత్వంతో ఎలాంటి ప్రయోజనం కన్పించట్లేదని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదంలో వాస్తవ కక్షిదారుల్లో ఒకరైన గోపాల్‌ సింగ్‌ విశారద్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని న్యాయపరమైన పరిష్కారం చూపాలని కోరారు. విశారద్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ పరశరణ్‌ వాదనలు వినిపించారు. దీనిపై వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం.. మధ్యవర్తిత్వ కమిటీ వారంలోగా అయోధ్యపై వాస్తవ నివేదిక అందించాలని ఆదేశించింది. ఆ నివేదికను పరిశీలించి అదే రోజు తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. ఒకవేళ మధ్యవర్తిత్వ కమిటీ సామరస్య పరిష్కారం చూపించకపోతే జులై 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 

Tags:    

Similar News