Southwest Monsoon: చల్లని కబురు.. ఈసారి ముందే.. అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు
Southwest Monsoon: గ్రీష్మకాల వేడితో మండిపోతున్న దేశానికి చల్లని శుభవార్త అందింది. నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
Southwest Monsoon: గ్రీష్మకాల వేడితో మండిపోతున్న దేశానికి చల్లని శుభవార్త అందింది. నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఇప్పటికే ఈ రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతం వరకు చేరుకున్నట్లు మంగళవారం మధ్యాహ్నం ప్రకటించింది.
నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు
రుతుపవనాల ప్రభావంతో గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం, రానున్న 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్-నికోబార్ దీవులన్నీ, దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించనున్నాయి.
మే 27 నాటికి కేరళను తాకే అవకాశం
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మే 27, 2025 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరం తాకే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు దేశంలో ప్రవేశిస్తుంటాయి. అయితే, ఈసారి అంచనాల కంటే ముందుగానే వర్షాలు తాకబోతున్నాయి. 2009లో మే 23న నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే వర్షాలు ముందుగా వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఈ ఏడాది ఎక్కువ వర్షపాతం?
IMD తాజా అంచనాల ప్రకారం, ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇది వ్యవసాయం, జలవనరులు, విద్యుత్ ఉత్పత్తి, జీడీపీ పెరుగుదలపై సానుకూల ప్రభావం చూపనుంది.
దేశవ్యాప్తంగా వర్షపాతం ప్రాధాన్యం
మన దేశంలో 52% నికర సాగుభూమికి వర్షపాతమే ప్రధాన ఆధారం. మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 40% దిగుబడి ఈ సాగు భూముల నుంచే వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. జలాశయాల నింపుదల, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సరఫరాకు ఇది అత్యంత అవసరం.