మధ్యప్రదేశ్‌ బీజేపీ వశం.. బలపరీక్ష నెగ్గిన చౌహాన్‌

Update: 2020-03-25 01:35 GMT
Shivraj singh chouhan

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మంగళవారం శాసనసభలో విశ్వాస పరీక్ష నెగ్గారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు హాజరుకాలేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ కు 104 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే 107 మంది శాసనసభ్యులు మద్దతు ఇచ్చారు, ఇందులో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మరియు స్వతంత్రులు కూడా ఉన్నారు. మొత్తంగా ఆయనకు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో ఓటింగ్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీకి హాజరుకాలేదు.

అయితే సభకు ముందు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసింది. అనంతరం శాసన సభలో సభా విశ్వాసం కోరుతూ ప్రవేశపెట్టిన ఏకవాక్య తీర్మానానికి మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. ప్యానెల్‌ స్పీకర్‌గా ఉన్న బీజేపీకి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే జగ్దీశ్‌ దేవ్‌డా స్పీకర్‌గా వ్యవహరించారు. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సారథ్యంలోని ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు దేవ్‌డా ప్రకటించారు.

విశ్వాస పరీక్ష అనంతరం సభను ఈ నెల 27వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు దేవ్‌డా ప్రకటించారు. కాగా కాంగ్రెస్ మాజీ ఎంపి జ్యోతిరాదిత్య సింధియా బిజెపిలో చేరడంతో ఆయన వర్గం ఎమ్మెల్యేలు 22 మంది తమ పదవులకు రాజీనామా చేసి వారు కూడా బీజేపీలో చేరారు. ఇందులో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించినట్టు అసెంబ్లీలో బల పరీక్ష జరగకముందే మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ రాజీనామా చేశారు. దాంతో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ క్రమంలో మంగళవారం అసెంబ్లీలో బలనిరూపణలో నెగ్గారు. దాంతో నెలరోజుల మధ్యప్రదేశ్ ప్రభుత్వ సంక్షోభానికి తెరపడినట్లయింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. వారిలో 9 మందిని బీజేపీ గెలుచుకున్నట్టయితే ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుంది.. అదే క్రమంలో కాంగ్రెస్ గనక 15 సీట్లను గెలుచుకుంటే మాత్రం కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఏమి జరుగుతుందో చూడాలి.   

Tags:    

Similar News