BJP: మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా కన్నుమూత
ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన మల్హోత్రా 94 ఏళ్ల వయసులో మృతి చెందిన మల్హోత్రా బీజేపీకి ఢిల్లీలో పెద్దదిక్కుగా వ్యవహరించిన మల్హోత్రా ఢిల్లీలో బీజేపీ విస్తరణకు అవిరళకృషి చేసిన వీకే మల్హోత్రా
BJP: మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా కన్నుమూత
బీజేపీకి ఒకప్పుడు ఢిల్లీలో పెద్ద దిక్కుగా వ్యవహరించిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా ఈరోజు ఉదయమే కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల కుటుంబసభ‌్యులు ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందించారు. తెల్లవారుజామున చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది. ఆయన మరణం పార్టీ శ్రేణులను, ముఖ్యంగా ఢిల్లీ బీజేపీ కార్యకర్తలను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది.
మల్హోత్రా ఐదు సార్లు ఎంపీగా, రెండు సార్లు ఢిల్లీ ఎమ్మెల్యేగా పని చేశారు. ఢిల్లీలో ఆయన బీజేపీ పార్టీ కృషి కోసం విపరీతంగా కృషి చేశారు. ఢిల్లీ తొలి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పని చేసిన ఈయన మృతితో బీజేపీ అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకూ అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మల్హోత్రా చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. మల్హోత్రా దేశ రాజకీయాలకు.. ముఖ్యంగా ఢిల్లీలో బీజేపీ బలోపేతానికి చేసిన కృషి అపారమైనదని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి ఒక తీరని లోటని నాయకులు పేర్కొన్నారు.
మల్హోత్రా జీవితం మొత్తం.. దేశానికి, ప్రజలకు అంకితం అయ్యిందని... అది ఆయన నిరాడంబరతకు, ప్రజా సేవకు నిదర్శనమని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా తెలిపారు. జనసంఘ్ రోజుల నుంచి ఆయన ఢిల్లీలో పార్టీ సిద్ధాంతాలను విస్తరించడానికి అలుపెరుగని కృషి చేశారని కొనియాడారు. ఆయన జీవితం ఎల్లప్పుడూ బీజేపీ కార్యకర్తలందరికీ స్ఫూర్తిగా నిలిచిందని.. ఇక భవిష్యత్‌లోనూ అలాగే నిలుస్తుదని సచ్‌దేవా కొనియాడారు.