IMD Rain Alert: ఈ సంక్రాంతికి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో పెను ముప్పు తప్పేలా లేదు..!!
IMD Rain Alert: ఈ సంక్రాంతికి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో పెను ముప్పు తప్పేలా లేదు..!!
IMD Rain Alert: మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ రానుండటంతో తెలుగు ప్రజల్లో ఇప్పటికే పండుగ సందడి మొదలైంది. ఆనందోత్సాహాలతో కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతిని జరుపుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి అంటే సాధారణ పండుగ కాదు… అది అతిపెద్ద పండుగ. ఉద్యోగాలు, ఉపాధి కోసం దేశ విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ఈ పండుగకు సొంత ఊళ్లకు చేరుకుంటారు. కోడి పందేలు, భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, రుచికరమైన పిండివంటలు, పతంగుల పండుగ, గంగిరెద్దుల సందడి… ఇలా సంక్రాంతి వేడుకలు గ్రామాల్ని పండుగ కళతో నింపేస్తాయి. ప్రతిసారీలా ఈ ఏడాది కూడా ఘనంగా సంక్రాంతిని జరుపుకోవాలని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు.
అయితే ఈసారి వాతావరణం పండుగ ఉత్సాహానికి ఆటంకం కలిగించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, ఇది సంక్రాంతికి ముందే అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జనవరి 8 లేదా 9వ తేదీల్లో శ్రీలంకకు సమీపంగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.
ఈ అల్పపీడనం ప్రభావం ప్రధానంగా తమిళనాడుపై ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. తొమ్మిదో తేదీ నుంచి అక్కడ వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముండగా, అవి సంక్రాంతి రోజుల్లో కూడా కొనసాగవచ్చని అంచనా. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
ప్రస్తుతం ఈ అల్పపీడనం బలపడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడి ఇది బలపడితే, వాయుగుండంగా లేదా తుపానుగా మారే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని చెబుతున్నారు. అలాంటిదైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, తమిళనాడులో పొంగల్ పండుగకు, ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి వేడుకలకు తీవ్ర ఆటంకం కలిగే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణలో మాత్రం ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా మారింది. గత కొన్ని రోజులుగా తీవ్రంగా ఉన్న చలిగాలుల ప్రభావం క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు పొడి వాతావరణం కొనసాగుతుండగా, ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో వాతావరణం అనుకూలంగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎక్కడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావని స్పష్టం చేసింది.
ఆదిలాబాద్, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉండే అవకాశముందని, మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. నిన్న జనవరి 5న మెదక్‌లో 13.2 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 13.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 18.2, హన్మకొండలో 15.0, ఖమ్మంలో 17, మహబూబ్‌నగర్‌లో 16.1, నల్గొండలో 14.6, నిజామాబాద్‌లో 16.7, రామగుండంలో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ చలి స్వల్పంగా కొనసాగుతోంది. పటాన్ చెరు ప్రాంతంలో 12 డిగ్రీలు, రాజేంద్ర నగర్‌లో 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హకీంపేటలో 16.7, హయత్ నగర్‌లో 15.6, బేగంపేటలో 15.6, దుండిగల్‌లో 15.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశముందని, ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 27 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీల వరకు ఉండవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.