తెరుచుకున్న శబరిమల ఆలయం ద్వారాలు

Update: 2019-11-16 15:20 GMT

శబరిమల ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి. శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటల సమయంలో ప్రధాన పూజారి కండారు మహేశ్ మోహనారు, ముఖ్య పూజారి ఏకే సుధీర్ నంబూద్రి ప్రత్యేక పూజలు నిర్వహించి గర్భగుడిని తలుపులు తెరిచారు. దీంతో శరుణుఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. శనివారం నుంచి వచ్చే నెల 27 వరకు మణికంఠుడికి నిత్య పూజలు నిర్వహిస్తారు. మరోవైపు ఆలయ ద్వారాలు తెరుచుకోవడంతో.. మాలధారులు స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. అలాగే వేలాదిగా స్వాములు.. అయ్యప్పను దర్శించుకునేందుకు పంబ దగ్గర వేచిఉన్నారు.

మరోవైపు అయ్యప్పను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు కూడా తరలివచ్చారు. విజయవాడ నుంచి పంబకు చేరుకున్న సుమారు పది మంది తెలుగు మహిళలను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఐడెంటీటీ కార్డులు పరిశీలించి వెనక్కు పంపారు. ఈ సమయంలో పోలీసులకు, మహిళలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే 50 ఏళ్ల లోపు ఉన్న మహిళలను ఆలయం లోనికి పంపడం కుదరదని పోలీసులు చెబుతున్నారు. ఇటు ప్రచారం కోసం శబరిమలకు మహిళలు రావొద్దని కేరళ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలా వచ్చిన మహిళలకు రక్షణ కల్పించబోమని తెలిపారు. ఒకవేళ 50 ఏళ్ల లోపు మహిళలు దర్శనానికి రావాలనుకుంటే.. కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలని సూచించారు.

ఇదిలా ఉంటే ఈ సారి కచ్చితంగా దర్శనం చేసుకుంటానని భూమాత బ్రిగేడ్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, మహిళా హక్కుల కార్యకర్త తృప్తీ దేశాయ్‌ స్పష్టం చేశారు. తనకు రక్షణ కల్పించకపోయినా దర్శించుకుని తీరుతానంటూ తేల్చిచెప్పారు. దర్శించుకోకుండా తాను శబరిమల వదిలివెళ్లేది లేదని చెప్పుకొచ్చారు.



Tags:    

Similar News